అటోళ్లు ఇటు.. ఇటోళ్లు అటు
మెదక్‌జోన్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో రాజకీయ వలసలు మొదలయ్యా యి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పలు పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా చెబుతుండటంతో ఆశావహులు కండువాలు మార్చుతున్నారు. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
గెలిచే సత్తా ఉన్న వారితో సంప్రదింపులు
జిల్లాలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల షెడ్యూలే మిగిలి ఉంది. కాగా చైర్మన్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాగా, ఫలానా వార్డు నుంచి టికెట్ కావాలని కోరి భంగపడిన ఆశావహులు మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ప్రజల్లో మంచి పేరు ఉండి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టే స్థోమత ఉన్న వారిని తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తామంటూ ఇప్పటికే అధికార కాంగ్రెస్, పత్రిపక్ష బీఆర్‌ఎస్ నేతలు పలు సమావేశాల్లో బహిరంగంగా చెబుతున్న విషయం విధితమే. అలాగే ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు..? అంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు వేర్వేరుగా సర్వేలు చేయిస్తున్నాయి. గురువారం మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ కొండన్ సావిత్రి, సురేందర్‌గౌడ్ దంపతులతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా, ఇటీవల నర్సాపూర్‌కు చెందిన పలు పార్టీల నాయకులు హరీశ్‌రావు సమక్షంలో గులా బీ పార్టీలో చేరారు. ఇదే మున్సిపాలిటీ నుంచి బీజేపీకి చెందిన మరికొంత మంది కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కాగా ఓ బీఆర్‌ఎస్ రాష్ట్రనేత ముఖ్య అనుచరుడు, మాజీ కౌన్సిలర్‌తో పాటు మరికొంత మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరనునట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధం అయినట్లు తెలిసింది.
బీజేపీ సైలెంట్
మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతుండటంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటూ దూకుడు పెంచాయి. బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉంది. మొదట్లో ఎంపీ రఘునందన్‌రావు పలు మున్సిపాలిటీల్లో పర్యటించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఆ పార్టీలో ఎన్నికల హడావుడి కనిపించడం లేదు.
జిల్లాలో జోరుగా రాజకీయ వలసలు
టికెట్ల కేటాయింపు అనంతరం
మరింత పెరిగే అవకాశం


