తెగిన చెరువు, కట్టు కాల్వలకు మరమ్మతులు కరువు
నిధులు లేవంటున్న అధికారులు కేంద్ర బృందం పరిశీలించినాఫలితం శూన్యం ఆందోళనలో అన్నదాతలు
అన్నదాతలకు కష్టకాలం వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు చెరువు, కుంటలు, కట్టు కాల్వలు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ. 5.25 కోట్లు అవసరం అవుతాయని సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేంద్రం బృందం సైతం పరిశీలించింది. అయినా నేటికీ పైసా విడుదల కాలేదు. దీంతో సుమారు 3,500 పైచిలుకు ఎకరాలు బీళ్లుగా మారాయి. – మెదక్‌జోన్
రాయినిపల్లి ప్రాజెక్టు కింద దెబ్బతిన్న కాల్వ
జిల్లాలో భారీ వర్షాలకు అనేక చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వలు తెగిపోయాయి. దీంతో నీరంతా వృథాగా పోయింది. కొన్నింటికి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ఫలితంగా కొన్ని చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. కాల్వలు ధ్వంసం కావటంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితి ఏర్పడింది. మరికొన్నింటికి శాశ్వత మరమ్మతులు చేస్తే తప్ప, వచ్చే వర్షాకాలంలో నీటి నిల్వ ఉండని దుస్థితి. అంతే కాకుండా అవి తెగిపోయే ప్రమాదం ఉందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు.
● మెదక్ మండలం రాయినిపల్లి ప్రాజెక్టు కింద సుమారు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీని పరిధిలో రాయినిపల్లి, పాతూర్, తిమ్మనగర్, మక్తభూపతిపూర్, మల్కాపూర్, శివ్వాపల్లి గ్రా మాల పంటలకు ఈ ప్రాజెక్టు నుంచే సాగునీరు అందుతోంది. కాగా గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కట్టు కాలువ పలుచోట్ల ధ్వంసం అయింది. ప్రస్తుతం దానికి మరమ్మతులు చేస్తే తప్ప ఆయకట్టుకు సాగు నీరందే అవకాశం లేదు. దీంతో రైతులు ఇటీవల తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 3 వేల ఎకరాలు బీళ్లుగా మారాయి.
● మెదక్ పట్టణ పరిధిలోని అవుసులపల్లికి చెందిన ఖజానా చెరువు భారీ వరద ఉధృతికి తెగిపోయింది. దాని ఆయకట్టు 100 ఎకరాలకు పైగా ఉంది. ప్రస్తుతం అందులో చుక్క నీరు లేదు. యాసంగి సాగుకు అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం మరమ్మతులు చేస్తేనే వచ్చే వర్షాకాలంలో పంటలు పండించుకునే వీలు ఉంటుంది.
● హవేళిఘణాపూర్ పెద్ద చెరువు వెనకాల 220 ఎకరాల ఆయకట్టు ఉంది. భారీ వర్షాలకు ఈ చెరువు కట్ట కొంతమేర తెగిపోవటంతో అధికారులు వెంటనే స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేసి కొంతమేర నీటి వృథాను అరికట్టగలిగారు. ప్రస్తుత యాసంగిలో ఆయకట్టులో సగం మేర పంటలు పండే అవకాశం ఉంది. కానీ దానికి శాశ్వత మరమ్మతులు అవసరమని అధికారులు చెబుతున్నారు.
● అనంతసాగర్ ఊరచెరువు ఆయకట్టు 50 ఎకరాలకు పైగా ఉంది. అదిసైతం వర్షాకాలం తెగిపోయి నీరంతా వృథాగా పోయింది. ప్రస్తుతం పశువులకు తాగు నీరు సైతం కరువైంది. దానికి వెంటనే మరమ్మతులు చేస్తేనే వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటుంది. ఖరీఫ్ పంటలు పండే అవకాశం దక్కుతుంది.
నిధులు మంజూరు కాగానే పనులు
సాగు నీరందించే కట్టు కాల్వలు, చెరువు కట్టల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేస్తాం.
– శివనాగరాజు,
డీఈ ఇరిగేషన్, మెదక్
తెగిన చెరువు, కట్టు కాల్వలకు మరమ్మతులు కరువు


