సడలని గులాబీ పట్టు | - | Sakshi
Sakshi News home page

సడలని గులాబీ పట్టు

Feb 18 2026 8:08 AM | Updated on Feb 18 2026 8:08 AM

సడలని గులాబీ పట్టు

సడలని గులాబీ పట్టు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పట్టు ఏమాత్రం సడలలేదని మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ..అధికార పార్టీకి దీటుగా మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసింది. కాంగ్రెస్‌ దాదాపు సమానంగా బల్దియాలను దక్కించుకుని ఆ పార్టీకి మెదక్‌ జిల్లా అడ్డాగా నిరూపించుకుంది. మొత్తం 19 మున్సిపాలిటీలకుగాను, తొమ్మిది మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌ స్థానాలను బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 85 శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ దక్కించుకుంటే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు వచ్చే సరికి 47% మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 బల్దియాల్లో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగింట మూడు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్‌పై పైచేయి సాధించింది. మెదక్‌లో జిల్లాకు వచ్చే సరికి బీఆర్‌ఎస్‌ పార్టీ కొంత వెనుకబడింది. నాలుగు బల్దియాల్లో ఒక మున్సిపాలిటీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపు పునరావృతమైనట్లు స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏడు ఎమ్మెల్యే స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే.

రెబెల్స్‌ను

తప్పించడంలో విఫలం

ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రెబెల్స్‌ (తిరుగుబాటు అభ్యర్థుల)ను బుజ్జగించడంలో బీఆర్‌ఎస్‌ ఈసారి పూర్తిగా విఫలమైంది. గులాబీ పార్టీ ఓటమి పాలైన మున్సిపాలిటీల్లో రెబెల్స్‌గా బరిలోకి దిగిన వార్డుల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ రెబెల్స్‌ పోటీలో ఉండకుండా సమన్వయం చేయడంలో ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు విఫలమయ్యారు. దీంతో చాలావార్డులు స్వల్ప మెజారిటీలతో గులాబీ పార్టీ వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు తమ తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. టికెట్లు ఇప్పించుకున్న ఈ నాయకులు వారి అనుచరులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో ఉన్న అంతర్గత ఆధిపత్యపోరు కూడా ఆ పార్టీ ఓటమికి పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఫలితాలను సాధించి మెతుకుసీమలో గులాబీ పార్టీకి ఏమాత్రం పట్టు సడలలేదని నిరూపించుకుంది.

కీలక అంశాలను

లేవనెత్తిన హరీశ్‌రావు..

రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా మెరుగైన ఫలితాలు సాధించడంలో మాజీమంత్రి హరీశ్‌రావు కీలకగా వ్యహరించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన లేవనెత్తిన అంశాలు అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. జహీరాబాద్‌నే ఉదాహరణగా తీసుకుంటే మంత్రి అజారుద్దీన్‌ జహీరాబాద్‌, కోహీర్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఎన్నికల్లో గెలిస్తే పలు అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి హోదాలో అజారుద్దీన్‌ హామీలు ఇచ్చారు. అజారుద్దీన్‌ మంత్రిగా కొనసాగాలంటే మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఎన్నికకావాల్సి ఉంటుంది. అయితే మూడు నెలల్లో ఆయన పదవి ఉంటుందో ఊడుతుందోననే తెలియని పరిస్థితి కాంగ్రెస్‌లో ఉందంటూ.. హరీశ్‌రావు తెరపైకి తెచ్చిన ఈ అంశం స్థానికంగా చర్చకు దారితీసింది. దీంతో అజారుద్దీన్‌ ఇచ్చిన హామీల అమలు అనేది ప్రశ్నార్థకమనే అంశం ఓటర్లలోకి తీసుకెళ్లగలిగారు. ఈ మున్సిపాలిటీ చైర్మన్‌ పదవి కాంగ్రెస్‌కు దక్కినప్పటికీ.. హస్తం పార్టీ కంటే ఒక కౌన్సిలర్‌ స్థానం బీఆర్‌ఎస్‌నే గెలుచుకోగలిగింది. మరోవైపు మహిళలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను సాధారణ ఓటర్లకు అర్థం అయ్యేలా.. తనదైన శైలిలో వివరించగలిగారు. ఇలా ప్రచారంతోపాటు, పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ ఆ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులను విజయతీరాలకు చేర్చడంలో హరీశ్‌ కీలకంగా వ్యవహరించారు.

కాంగ్రెస్‌కు దాదాపు సమానంగా

బల్దియా పీఠాలు కై వసం

పటాన్‌చెరు నియోజకవర్గంలో

క్లీన్‌స్వీప్‌ చేసిన బీఆర్‌ఎస్‌

19 మున్సిపాలిటీల్లో తొమ్మిదింట

గులాబీ జెండా రెపరెపలు

ఫలించిన హరీశ్‌రావు వ్యూహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement