అందరినీ కలుపుకొని పోతా
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచారని, రాష్ట్రంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం రెండో స్థానంలో ఉందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మద్దతు దారులు 167మంది గెలుపొందగా.. బీఆర్‌ఎస్ 52 మంది, ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. చాలాచోట్ల కాంగ్రెస్ నుంచి రెబల్‌గా పోటీ చేయడం కారణంగా బీఆర్‌ఎస్‌కు అన్ని సీట్లయినా వచ్చాయని తెలిపారు. రానున్న ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్‌లు అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా అందరనీ కలుపుకొని పోతామని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. నూతన సర్పంచ్‌లు గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు.
త్వరలో నల్లవాగు నీటి విడుదల
కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి త్వరలో నల్లవాగు ప్రాజెక్టు నీటిని వదలనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తైబందీ ప్రకారం ఆరుతడి పంటలకు రెండు, మూడు రోజుల్లో నీటిని వదిలేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సమావేశంలో సీడీసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, నాయకులు తాహెర్, పండరిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజుసేట్ పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే సంజీవరెడ్డి


