
కూలీలకు ఉపాధి కల్పించాలి
రేగోడ్(మెదక్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలందరికీ పని కల్పించాలని అదనపు డీఆర్‌డీఓ రంగాచారి తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 3.18 కోట్ల నిధులతో ఆయా పనులు చేపట్టారు. దీనిపై సోషల్ ఆడిట్ అనంతరం ప్రజా వేదిక ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై సభలో ఆడిట్ ఆధికారులు చదివి వినిపించారు. ఆయా పంచాయతీల్లో రూ. 70 వేలు రికవరీ చేసి రూ. 3 వేలు జరిమానా విధించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చిన్న చిన్న తప్పులు జరగకుండా, రికార్డులను సైతం సక్రమంగా ఉంచేందుకు జాగ్రత్త వహించాలన్నారు. ఇందిరమ్మ గృహాలకు ఆ ఇంటి యజమానులు పని చేస్తే రూ. 28,280 చెల్లిస్తామన్నారు. అదే విధంగా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 12 వేలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఆర్ మేనేజర్ రాజేందర్‌రెడ్డి, సోషల్ ఆడిట్ పీఈ సంపత్ కుమార్ ఆచార్య, ఎస్‌ఆర్పీ నాగరాజ్, ఏపీఓ జగన్మోహన్‌సింగ్, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు డీఆర్‌డీఓ రంగాచారి