
పల్లెప్రగతి ఎలా..?
కొత్త ఎంపీడీఓల ఆరా
ఉపాధి, గ్రామాభివృద్ధి పనుల పరిశీలన
చేగుంట(తూప్రాన్): ఇటీవల గ్రూప్ పరీక్షల్లో ఉద్యోగం పొందిన ఎంపీడీఓలు క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శుక్రవారం చేగుంట మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్‌ల ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించే ఉపాధిహామీ పనులతో పాటు గ్రామాభివృద్ధి విషయాల గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం, సెగ్రిగేషన్ షెడ్‌ల నిర్మాణం, వ్యవసాయ సంబంధిత పనులు, రోడ్ల నిర్మాణం, నర్సరీల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. వాటి వివరాలను నమోదు చేసుకున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ అనిల్‌కుమార్ వివిధ పనులపై వారికి అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీల ద్వారా నిర్వహించే గ్రామాభివృద్ధి కార్యక్రమాలను గురించి చిన్నశివునూర్ గ్రామంలో పరిశీలన జరిపారు. అనంతరం కొత్తగా విధుల్లో చేరుతున్న ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావులు గ్రామాల్లో అభివృద్ధిలో ఎంపీడీఓల బాధ్యతల గురించి తెలియజేశారు.
గాలికుంటు నివారణ
టీకాలు తప్పనిసరి
జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య
నర్సాపూర్ రూరల్: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య రైతులకు సూచించారు. నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంటలో గాలికుంటు నివారణ టీకాల శిబిరంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పశు వైద్య సిబ్బంది ప్రతీ గ్రామానికి వెళ్లి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేస్తున్నారని తెలిపారు.