
సర్కారు బడుల్లో అల్పాహారం
మెదక్ అర్బన్: విద్యార్థుల హాజరుశాతం పెంచడంతో పాటు ఆకలి బాధలు తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఉదయం పూట అల్పాహారం అందించనుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు, నిర్వహణ.. తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించినట్లు సమాచారం. జిల్లాలో లోకల్ బాడీ స్కూళ్లు 902 ఉండగా, విద్యార్థులు 64,681 మంది చదువుతున్నారు. కాగా 7 మోడల్ స్కూల్స్ ఉండగా, ఇందులో బాలురు సుమారు 2 వేలు ఉన్నారు. మొత్తం మీద సుమారు 66,681 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
వంట కార్మికుల జీతాలు పెంపు
తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందుకనుగుణంగా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి రోజు ఉదయం రోజుకో రకం టిఫిన్ అందివ్వనున్నారు. వారంలో మూడు రోజులు పులిహోర, వెజ్ బిర్యాని, కిచిడి.. మరో రెండు రోజులు బోండా, ఉప్మా, ఇడ్లీ అందించాలని సంకల్పించారు. 1 నుంచి 5 తరగతుల వారికి రోజుకు రూ. 8తో, 6 నుంచి 10 వరకు రూ.12 తో అల్పాహారం అందివ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు అవసరమైన పాత్రలు, గ్యాస్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. ఇక వంట కార్మికులకు ప్రస్తుతం ఉన్న రూ. 3 వేల జీతాన్ని రూ. 3,500కు పెంచాలని నిర్ణయించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
జిల్లాలో 66,681 మంది
విద్యార్థులకు ప్రయోజనం
ఇప్పటికే కొనసాగుతున్న
రాగిజావ పంపిణీ
తీరనున్న ఆకలి బాధలు
ప్రభుత్వ పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. సమయపాలనతో పాటు హాజరుశాతాన్ని పెంచేందుకు ఇటీవల ప్రభుత్వం విద్యార్థులతో పాటు టీచర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం ప్రవేశపెట్టింది. సమీప గ్రామా ల నుంచి వచ్చే విద్యార్థులు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉదయం 8 గంటలకే ఇళ్ల నుంచి బయలు దేరుతున్నారు. ఆ సమయానికి ఇంటి వద్ద వంటలు కాకపోవడంతో ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ప్రార్థనలో కళ్లు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుందని టీచర్లు అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. వారానికి మూడుసార్లు గుడ్లు, రాగి జావ ఇస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసుల సమయంలో సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు. ఈ విషయమై డీఈఓ రాధాకిషన్‌ను వివరణ కోరగా.. ఇప్పటివరకు అల్పాహారానికి సంబంధించి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.