
మంచి లక్ష్యం.. అంతా నిర్లక్ష్యం
● గుంతలు తీశారు.. మొక్కలు మరిచారు
● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తుకారాం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు అధికారులు గుంతలు తీయించారు. అయితే నాటడం మాత్రం మరిచారు. ప్రస్తుతం ఆ మొక్కలు ఎండుముఖం పట్టాయి. వన మహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో 30 వేల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉంది. అందులో భాగంగా నర్సాపూర్ నుంచి తుకారం తండాకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు నెల రోజుల క్రితం గుంతలు తీశారు. వాటిలో నాటేందుకు రాయరావు చెరువు కట్టపై నుంచి మొక్కలు తెచ్చి పెట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డు వెంట మొక్కలు నాటారు. కానీ సంరక్షణ చర్యలు మాత్రం చేపట్టలేదు. ఇదే విషయమై మున్సిపల్ ఎన్విరాల్‌మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా.. సిబ్బంది కొరత కారణంగా టార్గెట్‌ను రీచ్ కాలేకపోతున్నామని చెప్పారు. సిబ్బంది సమస్య తీరితే వన మహోత్సవంలో ఇచ్చిన 30 వేల మొక్కల నాటే టార్గెట్ పూర్తి చేసి సంరక్షిస్తామని తెలిపారు.

మంచి లక్ష్యం.. అంతా నిర్లక్ష్యం