
కాలుష్య తనిఖీల జాడెక్కడ?
● పరిమితికి మించి వెలువడుతున్న ఉద్గారాలు ● పట్టించుకోని రవాణాశాఖ అధికారులు
జిల్లాలో 1.88 లక్షల వాహనాలు
మెదక్ మున్సిపాలిటీ: పెరుగుతున్న అవసరాలతో ఇంటికో వాహనం తప్పనిసరైంది. వీటితో పాటు కాలుష్యం కూడా పెరుగుతోంది. జిల్లాలో 1.88 లక్షల వాహనాలు ఉండగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలు మరో లక్ష వరకు ఉంటాయని అంచనా. దీంతో పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతున్నాయి. తనిఖీలు చేసి నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆరునెలలకోసారి తప్పనిసరి
మోటారు వాహనాల చట్టం ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి తనిఖీలు చేయాలి. అయితే పర్యవేక్షించాల్సిన రవాణాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల కాలుష్యాన్ని పరిక్షించడం కోసం ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో నిబంధనల ప్రకారం పొల్యూషన్ పరీక్షలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డబ్బుల కోసం నామమాత్రంగా పరీక్షలు చేసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్లు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పొల్యూషన్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్న పీయూసీ రవాణా శాఖ అధికారులు, తనిఖీల జోలికి మాత్రం వెళ్లడం లేదు. సదరు వాహనం నిర్దేశించిన పొల్యూషన్ పరిధిలో ఉందా? లేదా? అనేది విధిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.
ఇష్టారాజ్యంగా పొల్యూషన్ సర్టిఫికెట్లు
పొల్యూషన్ తనిఖీ కేంద్రాలు నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 1.88 లక్షల వాహనాలు ఉండగా, వీటిలో 15 ఏళ్ల కాలం తీరిన వాహనాలు వేలల్లో ఉన్నాయి. ఆటోలు, లారీలు మరమ్మతుల కారణంగా పరిమితికి మించి పొగను వదులుతూ వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఇలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేయాల్సిన అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
వాతావరణం కలుషితం
కాలం చెల్లిన వాహనాలు వదిలిన పొగతో వాతావరణం కలుషితమై ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అన్నిరకాల వాహనాలు నిర్దేశించిన విధంగా పొగను వదులుతున్నాయా? లేదా అని పరిశీలించేందుకు జిల్లాలో పొల్యూషన్ కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ కేంద్రాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం వాహనాలను పరీక్షించి అవి వదులుతున్న కలుషితమైన పొగ ఏ మేరకు ఉందని వెల్లడించకుండా జిల్లా రావాణా శాఖ అధికారులు పీయూసీ జారీ చేస్తున్నారు. అయితే జిల్లాలో పొల్యూషన్ తనిఖీ చేసేందుకు మొత్తం 9 మోబైల్ వాహనాలు ఉన్నప్పటికీ, అవి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. కాగా విద్యాసంస్థల బస్సులు, లారీలు, కమర్షియల్ వాహనాలు మాత్రమే పొల్యూషన్ పరీక్ష చేయించుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు పది శాతం కూడా పరీక్షలు చేయించుకోవడం లేదు. ఆర్టీఏ, పోలీస్ అధికారులు పట్టుకున్నప్పుడు నామమాత్రపు జరిమానాతో తప్పించుకుంటున్నారు. ఇదే విషయమై ఇన్‌చార్జి డీటీఓ వెంకటస్వామిని వివరణ కోరగా.. తనిఖీలు చేయకుండా పీయూసీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. అలా జరిగినట్లు తేలితే చర్యలు చేపడుతామని తెలిపారు.