
మళ్లీ కల్లాలొస్తున్నాయ్..
● ‘ఉపాధి’లో నిర్మాణానికికేంద్రం అంగీకారం ● జిల్లా రైతులకు చేకూరనున్న లబ్ధి ● గతంలో 2,500 కల్లాల నిర్మాణం
రామాయంపేట(మెదక్): రైతులు పంట ఉత్పత్తులను ఆరబోసుకోవడానికి వీలుగా ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణానికి తాజాగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో రెండేళ్లపాటు అమలులో ఉన్న ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 మంది రైతులు కల్లాలు నిర్మించుకున్నారు.
తరచూ రోడ్డు ప్రమాదాలు
ధాన్యం ఆరబెట్టుకోవడానికి సరైన స్థలం లేకపోవ డంతో ఇళ్ల ఎదుట, సమీపంలోని రహదారులపై రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు ఢీకొని జిల్లాలో సుమారు 8 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. అలాగే రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసినందుకు 10 మందికిపైగా రైతులపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడానికి గాను అద్దె ప్రాతిపదికన టార్పాలిన్లు తీసుకుంటున్న వారు ఏటా కనీసం రూ. రెండు నుంచి రూ.మూడు వేల వరకు నష్టపోతున్నారు.
అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు
ఈ పథకం అమలులో ఉండగానే జిల్లా పరిధిలో 550 మందికిపైగా రైతులు ఎంపీడీఓ కార్యా ల యాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు కొందరు నిర్మాణాలకు సంబంధించి ముగ్గు పోసుకొని పునాదుల తవ్వకాలు చేపట్టారు. ఈక్రమంలో అర్ధంతరంగా కల్లాల నిర్మాణ పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకాన్ని ప్రారంభించిన ఏడాదిన్నరకే రద్దు చేసిన కేంద్రం, పలువర్గాల విజ్ఞప్తి మేరకు తాజాగా అంగీకరించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి పెద్ద సంఖ్యలో రైతులు కల్లాలు నిర్మించుకోనున్నట్లు సమాచారం.
ఇబ్బంది పడుతున్నాం
కల్లాల నిర్మాణానికి సంబంధించి కేంద్రం వెంటనే అనుమతులు మంజూరు చేయాలి. ఈ పథకాన్ని రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. రోడ్లపై ధాన్యం ఆరబోస్తున్న క్రమంలో ప్రమాదాలు సైతం జరిగాయి.
– రాజయ్య, రైతు, కాట్రియాల
కల్లాల నిర్మాణం అత్యవసరం
ధాన్యం ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి రైతులకు కల్లాల నిర్మాణం అత్యవసరం. గతంలో ఒకసారి కేంద్రం అనుమతించగా, సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది నిర్మించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ కేంద్రం కల్లాల నిర్మాణానికి అనుమతించడం సంతోషకరం. – గోపాల్, రైతు, దంతేపల్లి తండా