
కోలాహలం.. నిరుత్సాహం
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
చిన్నశంకరంపేట(మెదక్): స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో గురువారం ఉదయం కన్పించిన ఉత్సాహం సాయంత్రం కోర్టు తీర్పుతో నీరుగారింది. మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటుతో పాటు నామినేషన్ల స్వీకరణకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి నాయకుల రాకపోకలతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పలువురు నాయకులు నామినేషన్ పత్రాలను సైతం తీసుకెళ్లారు. తీరా సాయంత్రం హైకోర్టు స్టే విధించడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అప్పటి వరకు హడావిడి చేసిన అధికారులు సైతం సైలెంటయ్యారు. హెల్ప్‌డెస్క్ కోసం కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన టెంట్‌ను సిబ్బంది తొలగించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఆయా రాజకీయ పార్టీల నాయకులు హడావిడి చేశారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్‌లో బీఆర్‌ఎస్ మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థుల కసరత్తు కోసం గ్రామాల వారీగా గ్రూపు మీటింగ్ ఏర్పాటుచేశారు. ఈక్రమంలోనే హైకోర్టు స్టే విషయం తెలుసుకొని అర్ధంతరంగా సమావేశం ముగించారు. బీజేపీ నాయకులు ఉదయం నామినేషన్ పత్రాలు తీసుకొని జిల్లా కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ నాయకులు సైతం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. తీరా హైకోర్టు ఎన్నికలపై నాలుగు వారాలు స్టే విధించడంతో అవాక్కయ్యారు.
టెంట్‌ను తొలగిస్తున్న సిబ్బంది
నామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులు
టెంట్‌ను తొలగిస్తున్న సిబ్బంది
నామినేషన్ పత్రాల కోసం వస్తున్న నాయకులు

కోలాహలం.. నిరుత్సాహం