
పత్తి కొనుగోళ్లకు కపాస్ కిసాన్
● యాప్‌లో నమోదు చేసుకుంటేనేమద్దతు ధర ● అవగాహన కల్పిస్తున్న అధికారులు
సంగారెడ్డి జోన్: పత్తి కొనుగోలు, అమ్మకాలలో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చింది. పత్తి పంట రంగు మారిందని, నాణ్యత లేదని కొర్రీలు చూపిస్తూ రైతుల నుంచి దళారులు దోపిడీకి పాల్పడేవారు. కొనుగోలు చేసే సమయంలో తూకం సరైన విధంగా చేయకపోవడం, కొనుగోలు చేసిన తర్వాత సమయానికి డబ్బులు ఇవ్వకపోవడం తదితర మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు అనుసంధానం చేస్తూ కపాస్ కిసాన్ యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులకు తాము పండించిన పత్తి పంట సులభంగా కొనుగోళ్లు జరుపుకునేందుకు వీలుగా ఉంటుంది. దీనిపై మార్కెటింగ్ శాఖతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
నమోదు తప్పనిసరి
సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర పొంది పంటను అమ్ముకోవాలంటే ఈ కపాస్ కిసాన్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.