అందరిచూపు కోర్టు తీర్పుపైనే | - | Sakshi
Sakshi News home page

అందరిచూపు కోర్టు తీర్పుపైనే

Oct 2 2025 11:12 AM | Updated on Oct 2 2025 11:12 AM

అందరిచూపు కోర్టు తీర్పుపైనే

అందరిచూపు కోర్టు తీర్పుపైనే

మెదక్‌ అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆశావహులంతా అక్టోబర్‌ 8న కోర్టు వెలువరించే తీర్పు కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. 42% బీసి రిజర్వేషన్లు అమలు అవుతాయా? అసలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే గందరగోళంలో కొట్టు మిట్టాడుతున్నారు. ఈ నెల 9న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నప్పటికీ, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఖర్చులు పెట్టుకోవడానికి వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. ఈ నెల 5 వరకు జెడ్పీటీసీ ప్రాదేశిక నియోజక వర్గానికి ముగ్గురు ఆశావహుల చొప్పున పేర్లు పంపాలని పీసీసీ ఆదేశించడంతో, కాంగ్రెస్‌లో కొంత కదలిక మొదలైంది. అలాగే బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా బుధవారం ఏడుపాయల్లో కలుసుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఎన్నికల నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఎవరి ధీమా వారిదే

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలవుతాయని కాంగ్రెస్‌ ఽరాష్ట్ర నాయకులు ధీమాగా ఉండగా అదే పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకుల్లో మాత్రం అనుమానాలు లేవనెత్తుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాని వారు కూడా స్థానిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పార్టీలో ముఖ్యులుగా చలామణి అవుతున్న ఓసీ వర్గాలు రిజర్వేషన్లు అనుకూలించక పోవడంతో నిర్లిప్తంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రిజర్వేషన్ల అమలుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్‌కు అనుగుణంగా కొంత మేర సంసిద్ధత ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ, ఈ నెల 8 న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని వేచి చూస్తున్నారు. చాలామంది ఆశావహులు ఈ నెల 8 తర్వాతే ,ఆర్థిక పరమైన ఖర్చులు చేయాలని భావిస్తున్నారు. పండుగల సమయంలో కూడా వృథా ఖర్చులు చేయడం లేదు. సందిగ్ధత నడుమ ఎన్నికలకు సంసిద్ధులవుతున్నారు.

బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా!

మెదక్‌ జిల్లాలో 21 జెడ్పీటీసీలు,190 ఎంపీటీసీలు, 492 గ్రామపంచాయతీలు,5,23,327 ఓటర్లు ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం జీవో నంబర్‌ 09 విడుదల చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ జారీ చేసింది. అయితే బీసీ రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ సెప్టెంబర్‌ 27న కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, 42% రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వానికి,ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది.

42% బీసీ రిజర్వేషన్లపై

8న తీర్పు వెలువరించనున్న కోర్టు

ఎన్నికలు జరుగుతాయా

లేదా అనే దానిపై నెలకొన్న సందిగ్ధత

తీర్పు వచ్చాకే ఎన్నికల క్షేత్రంలోకి

దూకాలనుకుంటున్న నేతలు

స్థానిక ఎన్నికల తీరిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement