
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు
మెదక్‌జోన్/పాపన్నపేట (మెదక్): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపేలక్ష్యంగా ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఒక్కోజెడ్పీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున గుర్తించి జాబితాను పంపాలని కాంగ్రెస్‌పార్టీ సూచించగా ఆ దిశగా అభ్యర్థులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను ఇవ్వాలని ముఖ్యకార్యకర్తలకు సూచించింది.
ఈ నెల 5 నాటికి పీసీసీకి జాబితా
కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకోవాలని భావించి ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు అభ్యర్థులను గుర్తించి ఈనెల 5వరకు వారి జాబితాను పీసీసీకి పంపించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించటంతో ఆ పార్టీ నేతలు ఆగమేఘాల మీద గెలుపుగుర్రాల కోసం జల్లెడపడుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా బీఆర్‌ఎస్
రెండేళ్లల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని దీనినే అస్త్రంగా చేసుకుని స్థానిక ఎన్నికల బరిలో దిగాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. బీఆర్‌ఎస్ రాష్ట్రనాయకుడు దేవేందర్‌రెడ్డి బుధవారం జిల్లా కేంద్రంలోగల ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. పోటీ చేయాలనుకునే వారి జాబితాను ఇవ్వాలని వారికి సూచించారు.
ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి
ముగ్గురిని గుర్తిస్తున్న కాంగ్రెస్
ముఖ్యకార్యకర్తల సమావేశాల్లో
నిమగ్నమైన బీఆర్‌ఎస్, బీజేపీ
జీఎస్టీ తగ్గింపుతో బీజేపీ
ప్రధాని మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలకు కలిగే లాభాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థలల్లో భారీగా లబ్ధి పొందాలని బీజేపీ యోచిస్తోంది. పాపన్నపేట మండలంలో బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో బీజేపీ నిమగ్నమైంది.