
నేలపైనే భోజనం!
● అటకెక్కిన మన ఊరు–మనబడి
● మధ్యలోనే నిలిచిన పనులు
● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
తూప్రాన్: ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన మన ఊరు–మన బడి పథకం అటకెక్కింది. ఈ పథకం కింద ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులు నిలిచిపోయాయి. ఇందులో డైనింగ్ హాల్ నిర్మాణాలకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు నేలపైనే భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా మెదక్ జిల్లాలో మన ఊరు–మన బడి పథకానికి నిధుల కొరత వేధిస్తుంది. ఈ మేరకు పలు పాఠశాలల్లో డైనింగ్ హాల్ నిర్మాణాలు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పథకం కింద మెదక్ జిల్లాలో 142 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 85 ఉన్నత పాఠశాలలకు డైనింగ్ హాల్స్ మంజూరయ్యాయి. వీటిలో 18 పాఠశాలల్లో మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పాఠశాలల్లో పునాది, బెస్‌మెంట్, గోడలు పూర్తవ్వగా.. మిగతా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ డైనింగ్ హాల్స్ నిర్మాణానికి 2022–23 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రారంభించింది. మన ఊరు–మన బడి పథకం ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కో పాఠశాలకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు కేటాయించింది. కానీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ పేరుతో మరో పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకంలో మన ఊరు–మన బడి కింది నియామకమైన పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలలను ఎంపిక చేయడంతో డైనింగ్ హాల్స్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేయడంతో ఇబ్బందులు తప్పడంలేదు. డైనింగ్ హాల్స్ నిర్మాణాలు పూర్తయితే విద్యార్థులంతా ఒకే చోట బల్లలపై కూర్చోని క్రమశిక్షణతో భోజనాలు చేస్తారు. విద్యార్థులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న డైనింగ్ హాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.