
మెతుకు సీమ జాగృతమవుతుందా?
మెదక్‌అర్బన్: అసెంబ్లీ ఎన్నికల పరాజయ భారం నుంచి తేరుకొని.. సమస్యలపై సమరం సాగిస్తున్న గులాబీ దళంపై ఇప్పుడు మరో పిడుగు పడింది. ఒక వైపు కాళేశ్వరం లొల్లి సాగుతుండగానే.. మరో వైపు కవిత పేల్చిన మాటల తూటాలు కాక రేకెత్తించాయి. ప్రతిఫలంగా తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయాలు.. ఆపై ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాస్త్రం, తదనంతరం జోరు పెరిగిన విమర్శనాస్త్రాల వాడి, మెతుకు సీమలో చర్చనీయాంశంగా మారాయి.
మెదక్‌లో అంతటా ఆసక్తి
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానిది ఉమ్మడి మెదక్ జిల్లా కావడం, ఆయన కూతురు కవిత తన మనోభావాన్ని వెల్లడించటంతో మెతుకుసీమ ప్రజలు, రాజకీయ నేతల్లో ఉత్కంఠ రేగింది. కవితను మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్‌ఎస్, జాగృతి వర్గాల నుంచి పెద్దగా ప్రతిస్పందనలు రాలేదు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మాత్రం మెదక్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు గుప్పించారు. కానీ కవితపై తీసుకున్న చర్యలను మాత్రం స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ‘ఎద్దు పుండు కాకికి ముద్దు’అన్నట్లు కాంగ్రెస్, బీజేపీ వర్గాలు మాత్రం గులాబీ పార్టీలో వేరు కుంపటి అంశాన్ని ఆశగా గమనిస్తున్నాయి.
నాయకురాలి వెంటే..
మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. మహిళా జాగృతి, యువజన, విద్యార్థి, కార్మిక సంఘాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో తెలంగాణ జాగృతి మహిళా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలిగా మల్లిక పనిచేసిన సమయంలో మహిళల సమస్యలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ సంబరాలు, బోనాల ఊరేగింపు తదితర కార్యక్రమాల ద్వారా జనాలను చైతన్యవంతం చేశారు. 2022లో ఏడుపాయల్లో జరిగిన బోనాల ఊరేగింపులో కవిత పాల్గొన్నారు. అలాగే మెదక్‌లో సైతం ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే బ్లడ్ బ్యాంకులు, అవయవ దానాలు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణ, పేద విద్యార్థులకు ఉచిత చదువులు, నిరుపేద యువతులకు పుస్తెచ మట్టెలు అందజేత; వరదల సమయంలో సరుకుల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత విపత్కర సమయంలో జాగృతిలో పనిచేస్తున్న సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు నాయకురాలి వెంటే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందనే వేచి చూడాలి.
కేసీఆర్‌ది ఉమ్మడి జిల్లా కావడంతో మెదక్‌లో ఆసక్తి
వరద బాధితులకు జాగృతి కార్యకర్తల సేవలు
రసవత్తరంగా మారిన రాజకీయాలు
కవితక్క వెంటే ఉంటాం
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జాగృతి నాయకురాలు కవితక్క వెంటే ఉంటాం. ఆమె సూచనలకు అనుగుణంగా సంస్థను బలోపేతం చేసి, సేవా కార్యక్రమాలు చేపడతాం. కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా, కవితక్క సారథ్యంలో ప్రజాసేవలో పాల్గొంటాం. త్వరలో జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తాం.
– రమేశ్, తెలంగాణ జాగృతి జిల్లా నాయకుడు

మెతుకు సీమ జాగృతమవుతుందా?