
ఆశలపై కన్నీటి మేట
భారీ వర్షాలతో ధ్వంసమైన పంటలు
భారీ వర్షాలు తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇంకా వరద నీటిలోనే నానుతున్న పంటలు ఒకవైపు.. పంటంతా కొట్టుకుపోయి పొలాల్లో మేటలు వేయడం మరోవైపు.. శ్రమంతా వరద పాలు కావడంతో రైతన్న కంట కన్నీరే మిగిలింది. భారీ స్థాయిలో వచ్చిన వరదలతో వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. జిల్లా పరిధిలోని సుమారు 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రెండు వేలకుపైగా ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి.
రామాయంపేట శివారులో పంటచేనులో మేట వేసిన ఇసుక, రాళ్లు
రామాయంపేట(మెదక్): జిల్లాలో భారీ వర్షాలు కురిసి పది రోజులైనా ఇంకా పంట పొలాలు నీటిముంపులోనే ఉన్నాయి. పంట చేలల్లో ఇసుకతోపాటు పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లు వరద నీటిలో కొట్టుకొచ్చి మేట వేశాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన రైతులకు.. చేలల్లో మేటలు వేసిన ఇసుక, బండరాళ్లు, చెట్లు తొలగించడం తలకుమించిన భారంగా మారింది. వరద నీటిలో మునిగిన పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. ప్రధానంగా రామాయంపేట, హవేలీ ఘణపూర్, చేగుంట, నార్సింగి, నిజాంపేట, కుల్చారం, వెల్దుర్తి, తూప్రాన్, శివ్వంపేట మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో వేసిన ఇసుక మేటలు రహదారిని తలపిస్తున్నాయి. వరద నీటిలో ఉన్న పంటలు కుళ్లిపోతున్నాయి.
పంట నష్టంపై సర్వే
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వేలకు పైగా ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. పంట నష్టానికి సంబంధించి సర్వే కొనసాగుతోంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం.
–దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి
పొలమంతా ఇసుక మేటే
కొత్తగా నిర్మించిన జాతీయ రహదారి పక్కనే నా వ్యవసాయ భూమి ఉంది. రెండెకరాల మేర వరి పంట వేశాను. బ్రిడ్జి నుంచి వరదతో పొలమంతా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీనిని తొలగించుకోవాలంటే మరింత భారం. ఏం చేయాలో అర్థంకావడంలేదు.
–కోరెంకల భీరయ్య, రైతు, శమ్నాపూర్
వరద నీటిలోనే పంట
అప్పుచేసి నాలుగెకరాల మేర వరి సాగు చేశా. పంట మంచిగా పండితే ఈసారి కూతురి పెళ్లి చేయాలని ఆశపడ్డాను. నా ఆశలను వరుణదేవుడు ఛిద్రం చేశాడు. పొలంలో నీరు నిలిచి పంటంతా దెబ్బతిన్నది. ఇప్పటికీ పంట చేను నుంచే వరద పారుతోంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. –కళ్ల భూమయ్య, రైతు, హవేళి ఘణపూర్
రెండు వేలకుపైగా ఎకరాల్లో ఇసుక మేటలు
ఇంకా ముంపులోనే పొలాలు
దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతాంగం

ఆశలపై కన్నీటి మేట

ఆశలపై కన్నీటి మేట

ఆశలపై కన్నీటి మేట

ఆశలపై కన్నీటి మేట