
త్వరితగతిన నష్టం అంచనాలు
● అధికారులకు కలెక్టర్ ఆదేశం
● రైతులను ఆదుకుంటామని భరోసా
● దెబ్బతిన్న పంటల పరశీలన
అల్లాదుర్గం(మెదక్)/టేక్మాల్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: వరద నష్టం అంచనాలు యుద్ధ ప్రాతిపదికన జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి తన చాంబర్‌లో ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, విద్యా ఆరోగ్యశాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిబంధనలను అనుసరించి వరద నష్టం అంచనాలు ఉండాలని సూచించారు. త్వరితగతిన వరద నష్ట అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. టేక్మాల్ మండలం బొడ్మట్‌పల్లిలో గుండువాగు వల్ల దెబ్బతిన్న పత్తి పంటను, పొలాలకు వెళ్లే రోడ్డును కలెక్టర్ పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో అపార నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టాల అంచనాల అధికార యంత్రాంగం నిమగ్నమైందన్నారు. అధికారులు స్పష్టమైన నివేదిక రూపొందించాలని ఆదేశించారు. గుండువాగును విస్తరించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.