
సహకారం.. పొడిగింపు
పీఏసీఎస్‌ల పనితీరు ఆధారంగా నిర్ణయం
● ఉమ్మడి జిల్లాలోని 89 సొసైటీల్లో పాలకవర్గాల పదవీకాలం కొనసాగింపు ● 21 సొసైటీల్లో పెండింగ్ ● వారినే కొనసాగిస్తారా? లేదా అన్నది సందిగ్ధం
21 సంఘాలకు బ్రేక్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పనితీరు ఆధారంగా పదవీకాలాన్ని పొడిగించారు. ఆగస్టు 14వ తేదీతో పీఏసీఎస్‌ల పదవీకాలం ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 111 పీఏసీఎస్‌లు ఉండగా.. పాలకవర్గాల పనితీరు మేరకు 89 వాటికే పదవీకాలం పొడిగిస్తూ బుధవారం ఆయా జిల్లాల డీసీఓలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మెదక్ జిల్లాలోని రాంపూర్ పీఏసీఎస్‌కు పర్సన్ ఇన్‌చార్జి కొనసాగుతుండగా మరో 21 సంఘాల పదవీకాలం పొడిగింపు సహకార శాఖ పెండింగ్‌లో పెట్టింది.
సాక్షి, సిద్దిపేట: మండల స్థాయిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు అందజేస్తూ పీఏసీఎస్‌లు అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి వాటికి ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది. సంఘం పరిధిలోని రైతులు, డైరెక్టర్లు, చైర్మన్లతో కూడిన పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. 2020లో ఎన్నికై న పాలకవర్గం గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 14తో ముగియగా మరో ఆరు నెలలు(ఆగస్టు 14వ తేదీ) వరకు ఇదివరకే పొడిగించారు. గత నెలలో మరో ఆరు నెలలు పదవీకాలం పొడిగించేందుకు సహకార శాఖ పలు నిబంధనలు పెట్టింది.
పనితీరుపై ఆరా..
తాజా నిబంధనల ప్రకారం పనితీరు మెరుగ్గా ఉంటేనే వాటి పాలకవర్గాల గడువు పొడిగింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం సంఘాల వారీగా పది అంశాలతో కూడిన సమాచారం అందించాల్సిందిగా జిల్లా సహకారశాఖను ఆదేశించింది. సొసైటీ పరిధిలో పాత బకాయిల పరిస్థితి రుణాల తిరిగి చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా? నిధుల దుర్వినియోగం ఏమైనా జరిగిందా? జరిగితే వాటిపై ఎలాంటి విచారణ చేపట్టారు? దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారా? సొసైటీ కార్యకలాపాలపై ఆడిట్ చేశారా తదితర ఆంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.