
విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తం అవసరం
మెదక్ మున్సిపాలిటీ: మరికొద్ది రోజుల్లో వానాకాలం సాగు ప్రారంభం కానుంది. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పలు విత్తన కంపెనీల ప్రచారం ఊపందుకుంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా.. ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచార ఆర్భాటాలు సాగిస్తున్నాయి. విత్తనాలకు సంబంధించిన కంపెనీలు పట్టణాల్లో, గ్రామాల్లో రైతులను ఆకట్టుకునేలా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నాయి. మైక్ సెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయా కంపెనీల ప్రచారాలతో రైతులు మోస పోకుండా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సీడ్స్, ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ లైసెన్స్ కలిగిన మొత్తం 312 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 3.05 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. ఇందుకోసం 91.530 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం అవుతాయి. అలాగే 25 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 1.912 డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, 28,400 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయి.
ప్రకటనలు చూసి మోస పోవద్దు
పలు కంపెనీలు చేసే ప్రచారాలు, ప్రకటనలు చూసి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో గుర్తింపులేని లేబుళ్లతో కొన్ని కంపెనీలు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నాయి. కంపెనీలపై అప్రమత్తంగా ఉండాలి. అన్ని సరి చూసుకున్నాకే నమ్మకం కలిగితేనే కొనుగోలు చేయాలి. విత్తన కంపెనీపై ప్రభుత్వ నిబంధనల వివరాలు ఉన్నాయో లేదా? అన్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ముఖ్యంగా విత్తనాలను ఉత్పత్తి చేసే కంపెనీపై నమ్మకం ఉండాలి.
కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు
గుర్తింపు పొందిన విత్తనాలే మేలు
వ్యవసాయం అధికారుల సూచనలు
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం
జిల్లాలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ఇటీవల కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేకంగా వ్యవసాయ అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టాస్క్‌పోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం జిల్లాలో విస్తృతంగా పర్యటించి అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయనుంది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నకిలీ విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సైతం జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
–విన్సెంట్ వినయ్,
జిల్లా వ్యవసాయ అధికారి
ఎరువులు కొనే ముందు:
లైసెన్స్ కలిగిన డీలర్ నుంచే ఎరువులు కొనుగోలు చేయాలి
మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల బస్తాలనే కొనుగోలు చేయాలి.
ఎరువుల బస్తాకు చేతికుట్టు ఉంటే సీలు ఉందో లేదో చూసుకోవాలి
చిల్లులు పడిన, చిరిగిన ఎరువుల బస్తాలను కొనవద్దు
అన్య పదార్థాలు కలిస్తే ఎరువును కల్తీగా గుర్తించాలి
కొనుగోలు చేసే సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి
ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో ఎరువులను పరీక్షలకు పంపించాలి.
లైసెన్స్ కలిగిన వాటిల్లో కొనాలి
లైసెన్స్ పొందిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి
కొనుగోలు చేసిన సమయంలో బిల్లులను సరిచూసుకోవాలి
బిల్లుపై దుకాణం పేరు, కేంద్ర, రాష్ట్ర, అమ్మకపు పన్ను నంబర్, రైతు, గ్రామం పేరు విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుండి విత్తనాలు కొనుగోలు చేయ్యేద్దు. విత్తన ప్యాకెట్, సీసా, బస్తా, డబ్బాలకు సీలు ఉందో లేదో నిర్ధారించుకోవాలి.
కొనుగోలు చేసిన విత్తనాలను డీలర్ వద్దనే తూకం వేసి సరిచూసుకోవాలి.
విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి.
విత్తనాలు మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించాలి.

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తం అవసరం

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో అప్రమత్తం అవసరం