
స్పాట్ రిజిస్ట్రేషన్లు
స్లాట్ లేకున్నా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: స్లాట్ బుకింగ్ విధానం అమలవుతున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్ర యోగాత్మకంగా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లకు కూడా అవకాశం కల్పించారు సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు. దీంతో స్లాట్ బుక్ చేసుకోని వారు కూడా వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. సోమవారం మొత్తం 19 స్లాట్లు బుక్ కాగా, ఇందులో 20 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలా స్లాట్ బుక్ చేసుకోకుండా..వాక్ – ఇన్ పద్ధతిలో ఐదు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే గజ్వేల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా వాక్–ఇన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వివిధ రకాల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్‌ఆర్‌ఓ)ల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.
తప్పిన పడిగాపులు
ఏదైనా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్‌లో కేటాయించిన సమయానికి ఎస్‌ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు గంటల తరబడి కార్యాలయంలో పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఉంటే రోజంతా పనులు మానుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నారు.
వాక్ – ఇన్ రిజిస్ట్రేషన్లు అంటే..
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోని వారు ఈ వాక్ – ఇన్ విధానాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు చేస్తారు. స్లాట్ బుక్ చేసుకోనివారు నేరుగా సాయంత్రం 5 గంటలకు కార్యాలయానికి వెళితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. అయితే వాక్ – ఇన్ విధానంలో రోజుకు ఐదు రిజిస్ట్రేషన్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇలా వాక్ – ఇన్ విధానంలో ఎక్కువగా బ్యాంకు లోన్లకు సంబంధించిన మార్ట్‌గేజ్ డాక్యుమెంట్లు, రిలీజ్ డీడ్‌లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఒక్కో రోజు 48 స్లాట్లు..
స్లాట్ బుకింగ్ విధానంలో ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. 48కి మించి స్లాట్‌లు బుక్ చేయడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవడంతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చాలా మట్టుకు పడిపోయాయి. ప్రస్తుతానికి 48 డాక్యుమెంట్లకు మించి అవసరం పడటం లేదని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం జూన్ 2 నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మంచి ఫలితాలనిస్తోంది
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సదాశివపేట, గజ్వేల్, సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ విధానం అమలవుతోంది. అయితే ఈ విధానం మంచి ఫలితాలినిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తొందరగా జరుగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటోంది. స్లాట్‌లో పేర్కొన్న నిర్ణీత సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని వెళుతున్నారు. లైన్లో నిలబడటం, గంటల తరబడి వేచి ఉండటం వంటి తిప్పలు తప్పుతున్నాయి.
–ఐ.వి.సుబ్బలక్ష్మి,
జిల్లా రిజిస్ట్రార్, ఉమ్మడి మెదక్ జిల్లా
అత్యవసరమైన వారి కోసమే ఈ సేవలంటున్న అధికారులు
రోజుకు ఐదు చొప్పున డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

స్పాట్ రిజిస్ట్రేషన్లు