
పొంచి ఉన్న సీజనల్ గండం
రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య సమస్య ప్రధాన సమస్యగా మారింది. దీంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఎక్కడిక్కడ చెత్తా చెదారం పేరుకుపోవడం, ఫాగింగ్ చేపట్టకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా.. మున్సిపల్ అధికారులు ఏ మాత్రం ముందస్తు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అస్తవ్యస్త పారిశుద్ధ్యం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మునిసిపల్ ప్రత్యేక స్పెషల్ అధికారిగా మెదక్ ఆర్డీవో రమాదేవిని నియమించారు.
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజూ ఏడు మెట్రిక్ టన్నుల మేర చెత్తను సేకరిస్తున్నారు. 40 మంది పారిశుద్ధ్య సిబ్బంది, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోల్లో చెత్తను సేకరిస్తున్నారు. వారు సేకరించిన చెత్తను పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఎక్కలదేవి బండపై ఉన్న డంపు యార్డులో వేస్తున్నారు. కొత్తగా మురుగు కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో గతంలో నిర్మించినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందుల పాలవుతున్నారు. మురుగు కాలువల్లో క్రిమి సంహారక మందు చల్లడానికిగాను రూ.లక్షల వ్యయం చేసి రెండు ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటితోపాటు గడ్డి కత్తిరించే యంత్రాలు ఉన్నా ఏవీ పనిచేయడంలేదు. కాగా, వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ద్యం విషయమై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని,..? వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పడకేసిన పారిశుద్ధ్యం
ఎక్కడి చెత్త అక్కడే..
ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగం
పట్టించుకోని మున్సిపల్ అధికారులు
కార్యాచరణ రూపొందించాం
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం విషయమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకుగాను కార్యాచరణ రూపొందించాం. మురుగు కాలువల్లో ఫాగింగ్ చేయడంతో పాటు ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాం.
–దేవేందర్, మున్సిపల్ కమిషనర్

పొంచి ఉన్న సీజనల్ గండం