
ఇన్‌చార్జీల పాలన ఇంకెన్నాళ్లు?
● అదనపు కలెక్టర్ నుంచి అంతా ఇన్‌చార్జీ అధికారులే
● రెగ్యులర్ అధికారుల నియామకం ఎప్పుడు?
● అవస్థలు పడుతున్న ప్రజలు
మెదక్ కలెక్టరేట్: ఇన్‌చార్జీల పాలనతో జనం సతమతమవుతున్నారు. సకాలంలో సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్‌చార్జీ అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో ఎడ్కడా న్యాయం చేయలేక పోతున్నారు. సమస్యలు కూడా పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా కార్మికశాఖ అధికారిగా సంగారెడ్డికి చెందిన యాదయ్యను అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇప్పటి వరకు ప్రజలకు కనిపించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఎవరికి అర్థంకాని పరిస్థితి.
స్థానిక సంస్థల అధికారిగా నగేష్
జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ రెండు పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్‌గా నగేష్ విధులు నిర్వహిస్తుండగా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ బాధ్యతలు కూడా నగేష్ నిర్వర్తిస్తున్నారు. అలాగే.. గత డిసెంబర్‌లో ఆహార భద్రత అధికారి స్వాదీప్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి శిక్షణలోనే ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారి యాదయ్యకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. జిల్లా ప్రజలకు దర్శనమిచ్చిన దాఖలాలేవనే చెప్పాలి. కాగా ప్రస్తుతం ఆయన ఇన్‌చార్జీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం శాఖకు అధికారి లేరు. లేబర్‌కార్డుతోపాటు సంక్షేమ పథకాలపై దరఖాస్తులు చేసుకున్న కార్మికులు అధికారి రాక సమస్యలు పరిష్కారానికి నోచుకోక కార్యాలయానికి తిరుగుతున్నారు.
మెదక్ వ్యవసాయ అధికారి గోవింద్ నాలుగు నెలల క్రితం వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్‌కుమార్‌కు అదనపు వ్యవసాయ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.
ఇంకా కొన్ని శాఖలు
జిల్లా మైనింగ్, ఎకై ్సజ్, ఎంప్లాయిమెంట్, పశు సంవర్ధక, బీసీ సంక్షేమశాఖ అధికారి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి, లీగల్ మెట్రాలజీ, భూగర్భ జలశాఖ, విజయ డెయిరీ, వయోజన విద్యాశాఖ, డీఎల్‌పీఆర్‌ఓ, కో ఆపరేటీవ్ శాఖ, మార్కెటింగ్ ఏడీ, మార్క్‌ఫెడ్, హ్యండ్లూమ్, డీఎం సోలార్, ఆరోగ్యశ్రీ శాఖలు ఇన్‌చార్జీలతోనే కొనసాగుతున్నాయి.