యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలి | Sakshi
Sakshi News home page

యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనాలి

Published Fri, Nov 17 2023 4:26 AM

యువ ఓటర్లు, అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ - Sakshi

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని యువ ఓటర్లు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా పిలుపునిచ్చారు. గురువారం మెదక్‌ ఇంటి గ్రెటెడ్‌ ఆఫీసర్స్‌ కాంప్లెక్స్‌(ఐడీఓసీ)లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు సెల్ఫీ పాయింట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు పృథ్వీరాజ్‌, వ్యయ పరిశీలకుడు సంజయ్‌కుమార్‌, పోలీస్‌ పరిశీలకుడు సంతోష్‌కుమార్‌ తుకారాం, జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినిలతో కలిసి కరపత్రం అవిష్కరించారు. ఎన్నికలకు సంబంధించిన ఓటర్‌ నమోదు, ఎథిక్‌ ఓటింగ్‌, సీ విజిల్‌, టోల్‌ ఫ్రీ నెం1950 వంటి వాటిపై రంగోలి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో వివిధ శాఖలకు చెందిన 50 టీమ్‌లు పాల్గొన్నాయి. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా మాట్లాడుతూ సాధారణ ఎన్నికలలో భాగంగా స్వీప్‌ ఆధ్వర్యంలో జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 100 శాతం ఓటింగ్‌ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ‘నేను కచ్చితంగా గా ఓటు వేస్తాను’ అనే నినాదంతో ప్రజలందరూ ఓటింగ్‌లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. రంగోలి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం యువ ఓటర్లు, మహిళలు, ఉద్యోగులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పద్మశ్రీ, బ్రహ్మాజీ, రాజిరెడ్డి, విజయలక్ష్మి, కరుణ, యూనస్‌, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

సీ విజిల్‌ కరపత్రాలు తప్పనిసరి

ఓటరు సమాచార స్లిప్‌తోపాటు సీ విజిల్‌ కరపత్రాలు ప్రతి ఓటరుకు తప్పనిసరిగా అందాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా ఆదేశించారు. గురువారం మెదక్‌లోని దాయర వీధిలో ఓటర్‌ సమాచార స్లిప్పుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురికి స్లిప్పులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పోలింగ్‌కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌ వైజర్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ సమాచార స్లిప్పులు అందజేయాలని ఆదేశించారు. ఈనెల 22 వరకు రోజు వారీగా 200 ఓటర్‌ సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని, అప్పుడే పంపిణీ కార్యక్రమం త్వరితగతిన పూర్తవుతుందన్నారు. ఓటర్‌ స్లిప్‌తో పాటు ఓటర్‌ గైడ్‌, సీ విజిల్‌ కరపత్రాలు ప్రతి ఓటర్‌కు అందజేయాలని, అలాగే సీ విజిల్‌ యాప్‌, టోల్‌ఫ్రీ నెం.1950పై అవగాహన కల్పించాలని సూచించారు. దీనిని సెక్టార్‌ అధికారులు కచ్చితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల బూత్‌ లెవెల్‌ ఏజెంట్లకు సమాచారం అందించాలని తెలిపారు. దాయర పోలింగ్‌ కేంద్రం పరిధిలో మొత్తం 1343 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 620, సీ్త్రలు 723, మరణించిన వారు ఏడుగురు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, బీఎల్‌ఓ మాధవి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

వందశాతం ఓటింగ్‌ లక్ష్యం

మెదక్‌ ఐడీఓసీలో సెల్ఫీ పాయింట్‌

జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా

అభ్యర్థులకు గుర్తులు

అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి(కారు), కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌(చేయి), బీఎస్పీ అభ్యర్థి అంసాన్‌పల్లి లక్ష్మి(ఏనుగు), బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్‌(కమలం), స్వతంత్ర అభ్యర్థి వనం పుల్లయ్య(కెమెరా), ఇండియన్‌ బిలీవర్స్‌ పార్టీ అభ్యర్థి బొడ్డు దేవదాస్‌(గాజుగ్లాసు), భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి వనపర్తి రోహిత్‌(గన్‌ కిసాన్‌)లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులైన ఏ.కుమార్‌(చపాతీరోలర్‌), కొమ్మాట స్వామి(పండ్లబుట్ట), గడ్డమీది నాగరాజుగౌడ్‌(ఎయిర్‌ కండిషనర్‌), పట్లొళ్ల బాపురెడ్డి(ఉంగరం), లస్మగల్ల పద్మ(డోలీ), లంబాడి తార్య(బ్యాట్‌)లను కేటాయించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement