చర్లపల్లి –షాలిమార్ మధ్య నడుస్తున్న వీక్లి ఎక్స్‌ప్రెస్ కాగజ్‌నగర్– బల్లార్షా మార్గంలో నడపాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: చర్లపల్లి –షాలిమార్ మధ్య నడుస్తున్న అమృత్‌భారత్ వీక్లి ఎక్స్‌ప్రెస్ రైలును వయా పెద్దపల్లి– సిర్పూర్ కాగజ్‌నగర్ –బల్లార్షా మార్గంలో మరో వీక్లి సర్వీసుగా నడపాలని ఉత్తర తెలంగాణ రైల్వే ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 17065/66 నంబర్ గల చర్లపల్లి –షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వయా కాజిపేట –విజయవాడ –రాజమహేంద్రవరం, విశాఖపట్నం మార్గంలో నడుస్తోంది. 17065 రైలు ప్రతీ మంగళవారం ఉదయం 6.55 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.20కి షాలిమార్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17066 రైలు ప్రతీ బుధవారం మధ్యాహ్నం 12.50కు బయలుదేరి గురువారం సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు నాలుగున్నర గంటల పాటు ఈ రైలు చర్లపల్లిలో ఖాళీగా ఉంటుంది. ఈ రైలును చర్లపల్లిలో ఖాళీగా ఉంచకుండా షాలిమార్‌కు వయా పెద్దపల్లి –సిర్పూర్ కాగజ్‌నగర్– బల్లార్షా మార్గంలో వీక్లి ఎక్స్‌ప్రెస్‌గా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
కోల్‌కతా రైలు కోసం వినతి
కాజిపేట్ నుంచి కాగజ్‌నగర్ మార్గంలో కోల్‌కతాకు రైలు నడపాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఉత్తర తెలంగాణ ఫోరం సభ్యులు, రైల్వే మంత్రి, రైల్వే బోర్డ్ చైర్మన్ దక్షిణ మధ్య రైల్వే అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రస్తుతం పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం జిల్లాలో బెంగాలీ ప్రయాణికులు కోల్‌కతా వెళ్లాలంటే కాజిపేటకు వెళ్లి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ లేదా వార్దా వెళ్లి గీతాంజలి, హౌరా మెయిల్ వంటి రైళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలోని సర్‌సిల్క్, కౌటాల, రవీంద్రనగర్, ఈజ్‌గాం ప్రాంతంలో సుమారు 13 గ్రామాల్లో సుమారు 12వేల మంది బెంగాలీలు నివసిస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో ఇక్కడికి వలస వచ్చారు. అలాగే పెద్దపల్లి సమీపంలోని బసంత్‌నగర్ వద్ద కూడా బెంగాలీ కుటుంబాలు ఉన్నాయి. ఈ మార్గంలో రైలు నడిస్తే టాటానగర్, ఖరగ్‌పూర్ నగరాలకు కూడా అనుసంధానం ఏర్పడుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు.
టాటానగర్, ఖరగ్‌పూర్‌కు అనుసంధానం..
చర్లపల్లిలో నాలుగు రోజులు ఖాళీగా ఉండే రైల్వేను కాగజ్‌నగర్ మీదుగా నడిపితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేవలు విస్తరిస్తాయి. ఈ మార్గంలో రైలు నడిస్తే టాటానగర్, ఖరగ్‌పూర్ నగరాలకు కూడా అనుసంధానం ఏర్పడుతుంది. రైల్వే అధికారులు స్పందించి కాగజ్‌నగర్ మీదుగా రైలు నడిపేలా చర్యలు తీసుకోవాలి.
– ఠాకూర్ ప్రవీణ్ సింగ్, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం సభ్యుడు, కాగజ్‌నగర్


