చెత్త కుప్పలు.. మురుగునీరు.. దుర్వాసన | - | Sakshi
Sakshi News home page

చెత్త కుప్పలు.. మురుగునీరు.. దుర్వాసన

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

ఇదీ మంచిర్యాల నగర దుస్థితి

సెలవు రోజుల్లో చెత్త తరలింపుపై నిర్లక్ష్యం

డ్రెయినేజీల్లో పేరుకుపోతున్న చెత్త

అదనపు కార్మికులను తీసుకున్నా మారని పరిస్థితి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు..రోడ్లపైకి వస్తున్న మురుగు నీరు.. డ్రెయినేజీల్లో చెత్త పేరుకుపోయి వెదజల్లుతున్న దుర్వాసన.. ఇదే కనిపిస్తోంది. చెత్త కుప్పలను ఎప్పటికప్పుడు తొలగించక పోవడంతో పక్కనే ఉన్న డ్రెయినేజీల్లోకి చేరి మురుగు నీరు పారకుండా అడ్డుకుంటోంది. దీంతో దుర్వాసన వెదజల్లుతుండడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది.

అదనపు కార్మికులు ఎక్కడ?

మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉన్నాయి. పర్మినెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు 553 మంది ఉన్నారు. వీరంతా నగర పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఎలక్ట్రిక్‌ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో కేవలం పారిశుద్ధ్యం కోసం పనిచేసేవారు 400 మంది ఉన్నారు. 60 డివిజన్లలో పారిశుద్ధ్య పనులకు 400 మంది సరిపోవడం లేదని ఈ ఏడాది జూన్‌ 24న జరిగిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో అదనంగా 120 మంది కార్మికులను ఏడాది కాలం (2026–2027) సంవత్సరానికి గానూ తాత్కాలిక పద్ధతిలో తీసుకునేందుకు పరిపాలన ఆమోదం పొంది, కార్మికులను సైతం నియమించారు.

ఎక్కడ చూసినా దుర్వాసనే...

నగరంలో రోడ్లపై ప్రతీరోజు వేస్తున్న చెత్తకుప్పలను డంపింగ్‌ యార్డుకు తరలించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. వారం నుంచి పది రోజుల వరకు చెత్త కుప్పలు అలాగే ఉండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతోపాటు పశువులు, కుక్కలు చెత్త కుప్పల్లో తిరగడంతో పక్కనే ఉన్న డ్రెయినేజీల్లోకి వెళ్తోంది. దీంతో మురుగు నీరు పారకుండా నిలువ ఉంటోంది. నివాస ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలు, ప్రధాన రహదారుల పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని నగరవాసులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచినా, వారు ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.. చెత్తను ఎప్పుడు సేకరిస్తున్నారు.. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.. అనే అంశాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, హాజరు కాకపోయినా వారికి దినసరి వేతనాలను చెల్లిస్తున్నట్లు మున్సిపల్‌ రికార్డుల్లో నమోదు చేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

ఉన్న కార్మికులు పనిచేయకనే..

మంచిర్యాల నగర పాలక సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న 400 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు సక్రమంగా నిర్వహిస్తేనే నగరం పూర్తిగా పరిశుభ్రంగా ఉంటుంది. కానీ వారిలో పనిచేసే కార్మికులు సగం కూడా ఉండరని, కేవలం హాజరు వేసుకుని, వెళ్లిపోతారని, వేతనంలో పారిశుద్ధ్య విభాగానికి చెందిన అధికారులకు పెద్దమొత్తంలోనే ముట్టజెప్తారని ఆరోపణలు ఉన్నాయి. రెగ్యులర్‌గా పనిచేసే కార్మికులతోనే నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవకాశం ఉన్నా, అదనపు కార్మికుల పేరిట 120 మందిని తీసుకోవాలని కౌన్సిల్‌లో తీర్మానం చేసి, ఒక్కో కార్మికునికి రోజుకు రూ.500 వేతనం చెల్లిస్తున్నట్లు రికార్డుల్లోకి ఎక్కిస్తున్నా, ఇందులోనూ సగం మందే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా సగం మంది పనిచేయకున్నా, చేసినట్లుగా చూపించి, వారికి అందించే వేతనాలు ఉద్యోగుల జేబుల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ సెలవు దినాలు, పండుగ రోజుల్లో కార్మికులు కేవలం మూడోవంతు మాత్రమే పనిచేసి, తూతూ మంత్రంగానే చెత్త సేకరణ చేయడం, ప్రతీ డివిజన్‌లో చెత్తను తరలించక పోవడం వల్లే నగర ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement