మురళీకృష్ణకు ‘కోర్టు’ టెన్షన్‌..! | - | Sakshi
Sakshi News home page

మురళీకృష్ణకు ‘కోర్టు’ టెన్షన్‌..!

Oct 5 2026 1:33 AM | Updated on Oct 5 2026 1:33 AM

● కమిషనర్‌ హోదాలో కొనసాగింపుపై హైకోర్టు షోకాజ్‌ నోటీసు ● ఈనెల 8న నేరుగా హాజరుకావాలని ఆదేశం

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ మురళీకృష్ణ డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న తీరుపై హైకోర్టులో దాఖలైన ‘కో వారెంటో’ పిటిషన్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమిషనర్‌ స్థాయి పోస్టుకు సంబంధించిన అర్హతలు, డిప్యూటేషన్‌పై సుదీర్ఘకాలం కొనసాగుతున్న విధానం, తదితర అంశాలను పిటిషన్‌లో ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 8న హైకోర్టుకు నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి.

రెండేళ్లకు పైగా డిప్యూటేషన్‌పైనే..

మల్టీజోన్‌–1 మేనేజర్‌ హోదాలో ఉన్న మురళీకృష్ణను కమిషనర్‌గా వివిధ మున్సిపాలిటీల్లో డిప్యూటేషన్‌పై కొనసాగించడంపై పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. 2024 ఫిబ్రవరిలో క్యాతనపల్లి కమిషనర్‌గా నియమితులైన ఆయన కొద్ది నెలల్లోనే చెన్నూర్‌కు బదిలీ కావడం, అక్కడ రెగ్యులర్‌ కమిషనర్ల స్థానంలో కొనసాగడం, అనంతరం మళ్లీ క్యాతనపల్లికి రావడం వంటి పరిణామాలను పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

రెగ్యులర్‌ కమిషనర్ల వరుస

బదిలీలపై ప్రశ్నలు..

మురళీకృష్ణను డిప్యూటేషన్‌పై కొనసాగించేందుకు చెన్నూర్‌లో పనిచేసిన రెగ్యులర్‌ కమిషనర్‌ గంగాధర్‌, ప్రమోషన్‌పై వచ్చిన అంజయ్య, గ్రూప్‌–2 ద్వారా వచ్చిన కోటేశ్వర్‌రావు, తదితరుల పోస్టింగ్‌లు, బదిలీలకు సంబంధించిన పరిణామాలను కూడా పిటిషన్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చివరకు క్యాతనపల్లి కమిషనర్‌ మారుతిప్రసాద్‌ను చెన్నూర్‌కు, చెన్నూర్‌ కమిషనర్‌ మురళీకృష్ణను క్యాతనపల్లికి మార్చిన విషయం కూడా చర్చానీయాంశంగా మారింది.

మంత్రికి తలనొప్పిగా మారిన వ్యవహారం..

మురళీకృష్ణ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామికి తలనొప్పిగా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు కౌన్సిల్‌ సభ్యులు ఆయనను బదిలీ చేయాలని తీర్మాణం చేయడం, మరోవైపు ఆయన డిప్యూటేషన్‌, కమిషనర్‌గా కొనసాగింపుపై హైకోర్టులో న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తడం, అవినీతి ఆరోపణలు రావడం, అత్యంత వివాదాస్పదుడిగా మున్సిపల్‌ సిబ్బందిలోనే ఆయనపై కొంత వ్యతిరేకత ఉండడం వంటి అంశాలు ఒత్తిడిని పెంచుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మురళీకృష్ణను కొనసాగించాలా? బదిలీ చేయాలా?అన్న అంశంపై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు పరిణామాల నేపథ్యంలో తదుపరి చర్యలపై మంత్రి కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కౌన్సిల్‌ తీర్మానం

మరోవైపు మురళీకృష్ణ తీరుపై క్యాతనపల్లి మున్సిపల్‌ కౌన్సిల్‌లోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌, సీపీఐ కౌన్సిలర్లు ఆయనను బదిలీ చేయాలని తీర్మాణం చేసి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. తీర్మానం తాలూకు ప్రతులను ఇటీవల అడిషనల్‌ కలెక్టర్‌కు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement