నస్పూర్: ప్రజలకు ఆరోగ్యం, పిల్లలకు ఆహ్లాదం అందించాలనే ఉద్దేశంతో నగర పరిధిలోని 25వ డివిజన్‌లోని నాగార్జున కాలనీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లో పరికరాలు మరమ్మతులకు నోచుకోక పోవడంతో నిరుపయోగంగా మారాయి.
పార్కింగ్‌కు అడ్డాగా..
న్యూనాగార్జున కాలనీలో గత ప్రభుత్వం సుమారు రూ.50 లక్షల నిధులతో చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నిర్ణయించి పనులు చేపట్టింది. నిధుల లేమితో కేవలం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఓపెన్ జిమ్ చుట్టూ ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడంతో పిల్లలు ప్రతీరోజు సాయంత్రం వేళలలో ఆటలు ఆడుతారు. ఈ మధ్య కాలంలో ఖాళీ స్థలంలో డీసీఎంలు, ఐచర్ వ్యాన్లు, ట్రాక్టర్లు, కార్లు రోజుల తరబడి నిలిపి ఉంటున్నాయి. దీంతో పిల్ల లు ఆడుకోవడానికి స్థలం సరిపోవడం లేదని పలువు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాత్రి వేళల్లో వాహనాల మధ్య మద్యం సేవిస్తున్నారు. దీంతో సమీప ప్రజలు, ఓపెన్ జిమ్‌కు వచ్చే మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబందిత అధికారులు వెంటనే స్పందించి ఓపెన్ జిమ్ పరికరాలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకు రావాలని, ఓపెన్ జిమ్ ఆవరణలో ఎలాంటి వాహనాలను నిలిపి ఉంచకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.


