కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం 2027 –28కి గాను 9,11వ తరగతుల్లో ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడగించినట్లు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 8వ తరగతి, 10వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 10, 2027 ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్సీ కళాశాల వసతిగృహం సందర్శన
మంచిర్యాలఅర్బన్: స్థానిక ప్రభుత్వ ఎస్సీ కళా శాల బాలికల వసతిగృహాన్ని మంచిర్యాల ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ చాతరాజుల దుర్గాప్రసా ద్ శుక్రవారం రాత్రి సందర్శించారు. వసతిగృహంలోని సౌకర్యాలు, విద్యార్థినుల సంక్షేమం, వసతి గృహ నిర్వహణను పరిశీలించారు. అ నంతరం విద్యార్థినులతో మాట్లాడి కెరీర్ మార్గదర్శనం, లక్ష్య నిర్దేశం, ఉజ్వల భవిష్యత్తుపై సూచనలు చేశారు. ఏఎస్‌డబ్ల్యూవో సాయి ల చ్చన్న, హాస్టల్ వార్డెన్ చందన, హాస్టల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
పాత టికెట్లు.. కొత్త ధరలు
బాసర: బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అభిషేక, లడ్డూ ప్రసాదం ధరను రూ.100 నుంచి రూ.150కి పెంచిన విషయం తెలిసిందే. అయితే పాత ధరతో ముద్రించిన టికెట్లపైనే కొత్త ధరను ముద్రించి భక్తులకు విక్రయిస్తుండటంపై భక్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొత్త ధరకు అనుగుణంగా కొత్త బుక్కులు ముద్రించకుండా పాత బుక్కులపైనే కొత్త ధర ముద్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనాదేవిని వివరణ కోరగా ఇప్పటికే రూ.100 ధరతో ముద్రించిన పాత బుక్కులు ఉన్నాయని అవి పూర్తయ్యే వరకు వాటిపైనే రూ.150 ధర ముద్ర వేసి వినియోగిస్తున్నట్లు వివరించారు. పాత బుక్కులు పూర్తయిన అనంతరం కొత్త బుక్కులను ముద్రించి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.


