బిడ్డను ఇచ్చి పెళ్లి చేయలేదని దొంగతనం ఇందారం చోరీ కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్
జైపూర్: మేనమామ ఇంట్లో పెళ్లి ఉండగా.. అంద రూ ఊరెళ్లడాన్ని గమనించిన మేనల్లుడు ఇంటికి కన్నం వేశాడు. మామ బిడ్డను తనకు ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో స్నేహితుడితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. ఇంటి దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శుక్రవారం జైపూర్ పోలీసుస్టేషన్‌లో ఏసీపీ వెంకటేశ్వర్ సీఐ నవీన్‌కుమార్, ఎస్సై భూమేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. ఇందా రం నజీర్‌పల్లికి చెందిన షేక్‌సలీం కొడుకు షేక్ హారూన్ పెండ్లి ఈ నెల 22న ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి గత నెల 28న భాగ్యనగర్ రైల్లో హైదరాబాద్ వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న షేక్‌సలీం మేనల్లుడు బెల్లంపల్లికి చెందిన మహ్మద్ ముగ్దూం తన స్నేహితుడు సబ్బని లక్ష్మినారాయణతో కలిసి ఇందారం వచ్చాడు. తాళం వేసి ఉన్న మేనమామ ఇంట్లో చోరీకి పాల్ప డ్డారు. బీరువాలోని రూ.60వేల నగదు, బంగారు నగలు, వెండి ఎత్తుకెళ్లారు. అనుమానం రాకుండా ఉండేందుకు రెండో మామ ఖాజా పాషా ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి సొమ్ము ఎత్తుకెళ్లారు. చోరీ సొమ్మును కొంతమేరకు హైదరాబాద్‌లో విక్రయించారు. శుక్రవారం ఇందారం క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలు, 45తులాల వెండి, రూ.13,700 నగదు, చోరీకి ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.


