కౌటాల: మండలంలోని ము త్తంపేట గ్రామానికి చెందిన ఆదే లలిత –మాధవ్ దంపతుల కుమార్తె ఆదే శ్రీలత (15) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ సంతోష్‌కుమార్ తెలిపారు. శ్రీలత మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. గత కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదు. కడుపునొప్పి భరించలేక శ్రీలత శుక్రవారం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. శ్రీలత మృతదేహానికి సిర్పూర్(టి) ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతిరాలి తండ్రి మాధవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ తెలిపారు.
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
బెల్లంపల్లి: అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన పట్టణంలోని అంబేడ్కర్ భవనం ఎ దుట చోటు చేసుకుంది. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కే.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని మారుతినగర్‌కు చెందిన చెట్ల ఏడుకొండలు(55) రెండు నెలల క్రితం బెల్లంపల్లికి వలస వచ్చాడు. కప్‌బోర్డు వర్క్(వడ్రంగి పని) కోసం వచ్చి స్థానికంగా ఉంటున్నాడు. పని చేయగా వచ్చిన డబ్బుతో అతిగా మద్యం సేవిస్తూ ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. శుక్రవారం అతిగా మద్యం సేవించి ఆహారం లేకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురై మృతిచెందాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి భార్యాపిల్లలు లేకపోవడంతో బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహం అప్పగించారు.


