యువతకు ‘మత్తు’ ముప్పు! | - | Sakshi
Sakshi News home page

యువతకు ‘మత్తు’ ముప్పు!

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

● దమ్ముకొట్టి పెడదారి పడుతున్న వైనం ● సరదాగా మొదలై బానిసగా మారి.. ● చెన్నూర్‌లో నెల రోజుల క్రితం గంజాయికి బానిసైన ఐదుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని జిల్లా కేంద్రంలోని డీ–అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు. ● భీమారం మండలానికి చెందిన ముగ్గురు యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. వారిపై పోలీసులు గత నెల 10న కేసు నమోదు చేసి డీ–అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు.

దండేపల్లి: ఒకప్పుడు నగరాలకే పరిమితమైన మత్తు సంస్కృతి ఇప్పుడు పల్లెల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని కొందరు పిల్లల సిగరెట్లు, బీర్లు, గంజాయి వంటి వ్యసనాల బారిన పడడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. సరదాగా అలవాటు పడి ఒకరిద్దరితో మొదలైన స్నేహం పదిమందితో గ్రూపులుగా మారి అర్ధరాత్రి వరకు మత్తులో జోగే వరకు వెళ్తోంది. చీటకి పడగానే గ్రామ శివారు, రోడ్ల పక్కన ఉండే ఖాళీ స్థలాలు, నిరుపయోగంగా ఉన్న ఇళ్లను కొందరు యువకులు అడ్డాలుగా చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు మద్యం, ధూమపానంలో మునిగి తేలుతున్నారు. పిల్లలు అర్ధరాత్రి దాటినా ఇంటికి రాలేదనే బాధ్యతారాహిత్యం తల్లిదండ్రుల్లో కనిపిస్తుండగా.. మరోవైపు పోలీసుల పర్యవేక్షణ లోపించడం వారి జల్సాలకు అడ్డు లేకుండా పోతోంది. పిల్లలు స్కూల్‌, కాలేజీకి వెళ్తున్నారా లేదా.. ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నారు.. ఎటు వెళ్తున్నారు.. రాత్రి పూట ఇంటికి ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు.. వందలు, వేలల్లో డబ్బులు ఎందుకు అడుతున్నారు.. దేనికి ఉపయోగిస్తున్నారనే ప్రశ్నలను తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పిల్లలు అడగ్గానే డబ్బులు ఇవ్వడంతో పెడదారి పడుతున్నారు. రాత్రి 10గంటల్లోపు ఓసారి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తే యువకులు భయంతో ఇళ్లకు చేరే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలతోపాటు వారి స్నేహితులు, ఖర్చులపై ఓ కన్నేసి ఉంచాలని, సమయానికి ఇళ్లకు చేరేలా చూడాలని పోలీసులు సూచిస్తున్నారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం, పోలీ స్‌ యంత్రాంగం చర్యలు తోడైతేనే మత్తు సంస్కృతి నుంచి రేపటి తరాన్ని కాపాడుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గంజాయి నుంచి విముక్తి

భీమారం: గంజాయికి అలవాటుపడ్డ వలస కూలీని పోలీసులు చేరదీసి విముక్తి కల్పించారు. బీహార్‌ రాష్ట్రానికి చెందిన కూలీ ఉపాధి కోసం తెలంగాణకు వలస వచ్చి మండల కేంద్రంలో నివసిస్తున్నాడు. కొంతకాలంగా గంజాయికి బానిసై కుటుంబ జీవితానికి దూరమయ్యాడు. ఈ విషయం భీమారం ఎస్సై ఏ.రాజేందర్‌ దృష్టికి రావడంతో మంచిర్యాలలోని డీ–అడిక్షన్‌ సెంటర్‌కు తరలించారు. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స అనంతరం వలస కూలీ గంజాయి అలవాటు మానేసి కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. తన జీవితంలో మార్పుకు పోలీసుల సహకారమే కారణమని పేర్కొన్నాడు. శుక్రవారం స్వయంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్సై రాజేందర్‌ను కలిశాడు. స్వీట్లు అందజేసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకు రావడానికి అవసరమైన సహాయం అందించడం పోలీసుల సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement