చెన్నూర్: జిల్లాలోని ప్రధాన ఆలయాల కమిటీల నియామకానికి మోక్షం లభించడం లేదు. కమిటీల గడువు ముగిసి ఎనిమిదేళ్లు అవుతున్నా కొత్తవాటి ఏర్పాటుపై స్పష్టత రావడం లేదు. ఆలయాల్లో జరిగే ఉత్సవాల సమయాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి వెళ్లదీస్తున్నారు. ఆలయ వార్షిక ఆదాయం రూ.25లక్షలు దాటితే ధార్మిక పరిషత్ పరిధిలోకి వస్తాయి. వేలాల మల్లికార్జునస్వామి ఆలయం, మంచిర్యాల విశ్వనాథ ఆలయాలు ధార్మిక పరిషత్‌లో వస్తుండగా.. గూడెం సత్యనారాయణస్వామి ఆలయ కమిటీని ప్రభుత్వం నియామకం చేస్తుంది. వీటితోపాటు మరో తొమ్మిది ఆలయాలకు కమిషనర్‌లు కమిటీలు వేయాల్సి ఉంటుంది. వీటిలో బెల్లంపల్లిలోని కోదండరామాలయం, కన్నాలలోని బుగ్గరాజరాజేశ్వర ఆలయం, మంచిర్యాలలోని గౌతమేశ్వరాలయం, సమ్మక్క, సారలమ్మ ఆలయం, జన్నారంలోని లక్ష్మిదేవి ఆలయం, శ్రీరాంపూర్‌లోని సిద్ధి సాయిబాబా ఆలయం, చెన్నూర్ మండలం మదనం పోచమ్మ, జగన్నాథాలయం, కత్తరశాల మల్లికార్జున ఆలయం ఉన్నాయి. ఆయా ఆలయాల్లో ఉత్సవాల్లో సమయంలో ప్రత్యేక కమిటీలు వేస్తున్నారే గానీ రెగ్యులర్ కమిటీల ఊసేలేదు.
కుంటుపడుతున్న అభివృద్ధి
జిల్లాలోని ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. కమిటీలు నియమిస్తే అభివృద్ధి పనులు వేగంగా సాగే అవకాశం ఉంటుంది. భక్తులకు సౌకర్యాలు, వసతుల కల్పనపై దృష్టి సారించే వీలుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల నియామకం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశించారు. కమిటీల్లో చోటు లభిస్తుందని ఎదురుచూస్తున్నారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా కమిటీల ఏర్పాటుపై ఊసే లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికై నా రెగ్యులర్ కమిటీలు నియామకం చేయాలని కోరుతున్నారు.


