జైపూర్: ప్రసిద్ధిగాంచిన వేలాల మల్లన్నస్వామి క్షేత్రంలో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నిరకాల ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. శుక్రవారం మండలంలోని వేలాల, టేకుమట్ల గ్రామాల్లో వీబీ రామ్‌జీ ప్రత్యేక గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించాలని తెలిపారు. నీటి సంరక్షణ, ఇంకుడుగుంతలు, చెక్‌డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జి వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం వేలాల, గట్టుమల్లన్న ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వేలాల పుష్కరఘాట్‌ను పరిశీలించారు. రూ.14.30కోట్లతో పుష్కరఘాట్, సీసీ రోడ్లు, భక్తులకు మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. స్థానిక సర్పంచ్ డేగ స్వప్ననగేశ్, తదితరులు పాల్గొన్నారు.


