పాతమంచిర్యాల: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు, ప్రమాద సమయాల్లో క్షతగాత్రుల ప్రాణాలు నిలిపేందుకు రక్తం అవసరం. ప్రతి ఒక్కరూ భాగస్వాములై బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాతలుగా మారాలి. రక్తం అందక ఏ ఒక్క ప్రాణం పోకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేసే దాతలు గౌరవించడం, నిల్వలు పెంచడం, అపోహలు తొలగించడం తదితర లక్ష్యంతో ఏటా అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకొంటాం. ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిిసిన్ విభాగాన్ని స్థాపించిన డాక్టర్ జైగోపాల్ జాలీ జన్మదినం పురస్కరించుకొని ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అండ్ ఇమ్యూనోహెమటాలజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
నెలకు 1000 యూనిట్ల రక్తం అవసరం
జిల్లాలో ప్రతీనెల సుమారు 800–1000 యూనిట్ల రక్తం అవసరం. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రం ద్వారా తలసేమియా సికిల్‌సెల్ వ్యాధిగ్రస్తులకు 300 యూనిట్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర రోగులకు 500 యూనిట్లు అందిస్తున్నారు. ఒక యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుంది. 18 నుంచి 65 ఏళ్లు, 45 కిలోల బరువు ఉన్న వారు రక్తదానం చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం నిర్వాహకులు రక్తదానంపై అవగాహన, శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్ఫూరిగా నిలిచిన మధుసూదన్‌రెడ్డి
జిల్లా కేంద్రానికి చెందిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వి.మధుసూదన్‌రెడ్డి రక్తం గ్రూప్ ఏబీ నెగిటివ్. ఇప్పటివరకు 48 సార్లు రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కలెక్టర్లు, రాష్ట్ర గవర్నర్ చేతులమీదుగా ఆయన ప్రశంసాపతాలు అందుకున్నారు.


