సమస్యలపై కౌన్సిల్‌ సభ్యుల నిలదీత | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై కౌన్సిల్‌ సభ్యుల నిలదీత

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

● చెన్నూర్‌లో 18 అంశాలకు ఆమోదం

చెన్నూర్‌: మున్సిపల్‌ సమావేశంలో వార్డుల్లో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు సమస్యలు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చెన్నూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కోఆప్షన్‌ సభ్యుల గౌరవ వేతనం, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది బట్టలు, చెప్పులు, బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో లైటింగ్‌ ఏర్పాటుతో ఇతర పనుల కోసం నిధుల కేటాయింపుపై 18 అంశాల ఎజెండాను ప్రవేశ పెట్టారు. నాలుగోవార్డు కౌన్సిలర్‌ పెండ్యాల సాగర్‌ మాట్లాడుతూ.. తమ వార్డులో మోటార్‌ చెడిపోయి నెలరోజులవుతున్నా రిపేర్‌కు దిక్కులేదని తెలుపగా, త్వరలోనే మోటార్‌ బాగు చేయిస్తానని కమిషనర్‌ మారుతీప్రసాద్‌ చెప్పారు. అధికారిక కార్యక్రమాల్లో కౌన్సిలర్లకు సమాచారం లేకుండా కాంగ్రెస్‌ నాయకులకు సమాచారం ఇస్తూ వారితో పనులు ప్రారంభించడం మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధమని మూడోవార్డు కౌన్సిలర్‌ అంబటి శంకర్‌ పేర్కొనగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని, రానున్న ప్రతీ సమావేశం, అభివృద్ధి పనుల సమాచారం తప్పనిసరిగా ఇస్తామని కమిషనర్‌ పేర్కొన్నారు. శ్రీనగర్‌కాలనీలో రోడ్డు మంజూరైనా పనులు ప్రారంభించకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని ఏడోవార్డు కౌన్సిలర్‌ కొప్పుల ప్రభాకర్‌ కమిషనర్‌ను ప్రశ్నించగా, అధికారులతో మాట్లాడి ఎందుకు పనులు నిలిపివేశారో తెలుసుకుంటానని తెలిపారు. ఆదర్శనగర్‌ కాలనీలో రోడ్డు మధ్యలో విద్యుత్‌ స్తంభం వంగి ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వెంటనే స్తంభాన్ని తొలగించాలని 14వార్డు కౌన్సిలర్‌ మేడ స్రవంతి కోరగా, విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం కౌన్సిలర్ల ఆమోదం మేరకు 18 అంశాలను తీర్మానించినట్లు కమిషనర్‌ తెలిపారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వినయ్‌కుమార్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement