నస్పూర్/మందమర్రిరూరల్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నస్పూర్ గేటు వద్ద సోమవారం లారీ, ఆటో ఢీ కొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రామిటెంకి దివ్యవాణి (33) మృతి చెందింది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దివ్యవాణిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. దివ్యావాణి మృతితో ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆటోలో డ్రైవర్‌తో సహా ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా సంఘటన స్థలంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయాలపాలైన నరమల్లి లక్ష్మి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుండగా, సల్లూరి అనూష, ఆటో డ్రైవర్ షెగ్గెం ప్రశాంత్ కరీంనగర్‌లో చికిత్స పొందుతున్నారు.


