అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీ
లబ్ధిదారుల సేవలకు ఆటంకం
ఏజెన్సీ సమస్యతో నోటిఫికేషన్‌లో జాప్యం
మంచిర్యాలటౌన్: చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించడంతో పాటు, చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలతో సేవలకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా టీచర్లు, ఆయాల ఖాళీలు 554 ఉండడంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. చిన్నారులను కేంద్రాలకు తీసుకువచ్చి, పౌష్టికాహారం అందించేందుకు టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న మరో కేంద్రం టీచర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో రెండు కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందించడం కష్టంగా మారుతోంది. పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు నిర్వహిస్తున్న పోషణ మాసం, పోషణ్ అభియాన్ వంటి కార్యక్రమాలు సిబ్బంది కొరతతో అనుకున్న లక్ష్యంను నెరవేరడం లేదు. కేంద్రానికి వచ్చే చిన్నారుల ఎత్తు, బరువు, భుజం కొలతను తీసుకుని, వారి ఆరోగ్యస్థితులను నమోదు చేసి, పౌష్టికాహార లోపంతో ఉన్న వారిని గుర్తించి, వారికి ప్రత్యేకంగా పౌష్టికాహారంను అందించి, ఆరోగ్య పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా, సిబ్బంది కొరతతో చిన్నారులకు అవేం అందడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఎక్కువగా ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది.
ఏజెన్సీ ప్రాంతంలోనే సమస్య
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల ఖాళీల వివరాలను జిల్లా అధికారులు ఉన్నతాధి కారులకు పంపించి రెండు నెలలు దాటింది. మందమర్రి, కాసిపేట, తాండూర్, దండేపల్లి మండలాల్లో ఏజెన్సీ ఏరియాలో ఎస్టీలకు మాత్రమే పోస్టులను కేటాయించాల్సి ఉండగా, ఆయా ప్రాంతాల్లో ఎస్టీ అభ్యర్థులు లేక ఇబ్బందిగా మారుతోంది. దండేపల్లి మండలంలోని గూడెం, తాండూరు మండలంలోని రేచిని, అబ్బాపూర్ వంటి గ్రామాల్లో ఎస్టీ అభ్యర్థులు లేకపోవడం, ఆయా పోస్టులకు లోకల్‌గా ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు కావడంతో ఏజెన్సీ ఏరియాల నోటిఫికేషన్‌కు ఇబ్బంది గా మారడం వల్లనే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను వే యడంలో తాత్సారం జరుగుతున్నట్లు
తెలుస్తోంది.
పెరుగుతున్న ఖాళీలు..
65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల రిటైర్మెంట్‌తో ప్రతి నెలా ఖాళీల సంఖ్య పెరుగుతోంది. 2024 జులై 1నాటికి 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాలు విధులకు హాజరు కావద్దని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా 18 మంది టీచర్లు, 106 మంది ఆయాలు 65 ఏళ్లు పైబడడంతో వారిని రిటైర్మెంట్‌గా ప్రకటించేశారు. ప్రతి నెలా రిటైర్మెంట్లు కొనసాగుతుండడంతో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. రిటైర్మెంట్ అయిన టీచర్ స్థానం ఖాళీ కావడంతో సమీపంలోని మరో అంగన్‌వాడీ టీచర్లకు అదనపు విధులను కేటాయిస్తుండగా, ఆయా పోస్టు ఖాళీ అయిన చోట, అంగన్‌వాడీ టీచర్‌కు అదనంగా విధులు తోడవుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలు అంతే సంఖ్యలో ఉండగా, పెరిగిన జనాభాతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి టీచర్లపై అధికభారం పడుతోంది. అంతేకాకుండా బీఎల్‌వోలుగా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టే వివిధ రకాల కార్యక్రమాలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించడంతో టీచర్లు పూర్తిస్థాయిలో విధులకు న్యాయం చేయలేక పోతున్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టులు భర్తీ చేస్తేనే లబ్ధిదారులకు కొంత వరకై నా లబ్ధి చేకూరనుంది.
ఉన్నతాధికారులకు పంపించాం
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల వి వరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఖాళీగా ఉన్న స్థానాలను సమీపంలో ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు అదనపు బాధ్యతలను అప్పగించాం. చిన్నారులు, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశాం.
– రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల
జిల్లాలో ప్రాజెక్టుల వారీగా అంగన్‌వాడీ
కేంద్రాల్లో టీచర్ పోస్టుల ఖాళీలు
ప్రాజెక్టు అంగన్‌వాడీ విధుల్లో ఖాళీలు
కేంద్రాలు ఉన్నవారు
మంచిర్యాల 244 223 21
బెల్లంపల్లి 283 265 18
లక్సెట్టిపేట్ 203 186 17
చెన్నూర్ 245 214 31
మొత్తం 975 888 87
ప్రాజెక్టుల వారీగా ఆయా
పోస్టులు, ఖాళీల వివరాలు
ప్రాజెక్టు అంగన్‌వాడీ విధుల్లో ఖాళీలు
కేంద్రాలు ఉన్నవారు
మంచిర్యాల 244 140 104
బెల్లంపల్లి 283 160 123
లక్సెట్టిపేట్ 203 119 84
చెన్నూర్ 245 156 156
మొత్తం 975 508 467
అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులు
గర్భిణులు 3,649
బాలింతలు 2,961
చిన్నారులు 35,537


