రెచ్చిపోతున్న రాగి దొంగలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న రాగి దొంగలు

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● నష్టపోతున్న రైతులు

● ఈనెల 14న బెల్లంపల్లిలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లకు సంబంధించిన రాగి తీగలను దొంగిలించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

● ఈనెల 23న తాండూర్‌ మండలంలో కాపర్‌ వైర్‌ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల రాగి తీగ, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

బెల్లంపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో రాగి తీగల చోరీల పరంపర కొనసాగుతోంది. కొన్ని నెలలుగా స్తబ్ధతగా ఉన్న దొంగలు మళ్లీ పెట్రేగిపోతుండడంతో వ్యవసాయ పంపు మోటార్లకు రక్షణ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి శివారులో ఓ రైతు వ్యవసాయ బోరులో నుంచి పంపు మోటారును చోరీ చేసి ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.

అంతటా చోరీలే..

పంపు మోటార్ల చోరీకి నిర్దిష్టమైన ప్రాంతమనేది ఏదీలేదు. ఎక్కడ పడితే అక్కడ దొంగలు అపహరించుకు పోతున్నారు. గత ఎండాకాలంలో రైతులు వ్యవసాయ బోరు నుంచి పంపు మోటార్లను తీసి ఇంటికి తీసుకెళ్లగా వానాకాలం పంట సాగుకు మళ్లీ బోర్లలో మోటార్లు దించి సాగునీరందిస్తున్నారు. ఇదే గుర్తు తెలియని దొంగలకు వరంగా మారింది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన, తిర్యాణి , దహేగాం, కాగజ్‌నగర్‌ మండలాల్లో బెల్లంపల్లి నియోజక వర్గంలోని తాండూర్‌, బెల్లంపల్లి కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, కాసిపేట మండలాల్లో పంపు మోటార్ల చోరీలు జరుగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ సీజన్‌లో కనీసం 30కి తగ్గకుండా పంపు మోటార్లు ఎత్తుకెళ్తున్నట్లు అంచనా. నలుగురైదుగురు గ్యాంగ్‌గా ఏర్పడి ఈ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

పగలు రెక్కీ.. రాత్రి చోరీ..

ప్రస్తుతం మార్కెట్లో రాగికి డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా భావించిన దొంగలు చోరీలు తీవ్రతరం చేశారు. వ్యవసాయ పంపు మోటార్ల వైండింగ్‌లో కొద్దిపాటిగా రాగి ఉంటుంది. ఆ రాగి కోసం దుండగులు ఎంతకై నా తెగిస్తున్నారు. పగటి పూట పంట పొలాల వైపు రెక్కీ నిర్వహించి చీకటి పడడంతోనే బోరు నుంచి పంపు మోటారును బయటకు తీసి ఎత్తుకెళ్తున్నారు. ఒక్కో పంపు మోటర్‌లో ఉండే రాగిని అమ్మడం ద్వారా రూ. 2 వేలకు మించి ధర రాదని, కానీ ఆ మొత్తానికే ఏకంగా పంపు మోటారును ఎత్తుకెళ్లి రైతుకు వేలాది రూపాయల నష్టం కలిగిస్తున్నారు. రైతుకు కలుగుతున్న నష్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తమకు వచ్చే డబ్బుల కోసం పంపు మోటార్లు పట్టుకెళ్తున్న దొంగల తీరు రైతులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

స్క్రాప్‌ దుకాణాలకు తరలిస్తున్న వైనం...

పంపు మోటార్లను దొంగిలించిన దుండగులు వాటిని ధ్వంసం చేసి అందులోని రాగిని స్క్రాప్‌ దుకాణాలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. గుట్టుగా నిర్వహిస్తున్న ఈ దందాను అరికట్టడానికి పోలీసు యంత్రాంగం తగిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్క్రాప్‌ దుకాణాలపై ప్రత్యేక నిఘా పెడితే దొంగలు పట్టుబడే అవకాశాలు ఉంటాయని రైతులు అంటున్నారు. అదే తీరుగా దొంగతనం చేసి పట్టుకొచ్చిన పంపు మోటార్ల లోని రాగిని కొనుగోలు చేస్తున్న స్క్రాప్‌ దుకాణాల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తే కొంతవరకై నా పంపు మోటార్ల చోరీలు ఆగే అవకాశాలు ఉంటాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం

రాగి కోసం టవర్లకు సంబంధించిన వైర్లను, ఇతర వైర్లను, పంపు మోటార్లను దొంగిలిస్తున్న దుండగులను పట్టుకునే చర్యలు తీవ్రతరం చేశాం. బెల్లంపల్లిలో 8 మందిని, తాండూర్‌లో ఆరుగురు కాపర్‌ వైరు చోరీ నిందితులను పట్టుకున్నాం. వ్యవసాయ పంపు మోటార్లను చోరీ చేస్తున్న దొంగలను కూడా పట్టుకుంటాం. ఇందుకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం.

– సీహెచ్‌ హనోక్‌, బెల్లంపల్లి రూరల్‌ సీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement