శ్రీరాంపూర్: ఆరోగ్యమే మహాభాగ్యమని శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యాలయ ఉద్యోగులు, అధికారులకు ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీరోజు వాకింగ్, వ్యాయా మం, మెడిటేషన్, యోగా చేయాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం ప్రతినిధి పద్మ, ఏజీఎం (ఫైనాన్స్) శ్రీధర్, డీజీఎంలు అనిల్ కుమార్, హరి నారాయణ, డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్‌బాబు, వైద్యులు లోకనాథ్ రెడ్డి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
పనిముట్ల కొరత తీర్చాలి
శ్రీరాంపూర్: గనిలో పనిముట్ల కొరత తీర్చాలని ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సీలం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్సార్పీ 3 గనిలో కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గనిలో డ్రిల్ బిట్లు, కీలలు, ఇతర పనిముట్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. రక్షణ పరికరాలు కూడా సరిపడా సమకూర్చడం లేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు కలవేలన శ్యామ్, చల్లంగి శ్రీనివాస్, కారుకూరి మనోజ్, శంకర్, ఇండ్ల కిరణ్, బొడ్డు ప్రసాద్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ప్రయాగ్‌రాజ్ నుంచి చర్లపల్లి మధ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (వీక్లీ స్పెషల్) మంగళవారం నుంచి ప్రారంభమైంది. మంచిర్యాల స్టేషన్‌లో రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. చర్లపల్లి–ప్రయాగ్‌రాజ్, ముజాఫర్ మధ్య వీక్లీ స్పెషల్ రైలు నడుస్తుంది. దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికుల సౌకర్యార్థం వారానికి ఒకసారి స్పెషల్ రైలును కేటాయించాలని కోరడంతో ఈ రైలును కేటాయించారు. వీక్లీ రైలుతో మంచిర్యాలకు చెందిన ప్రయాణికులకు కాశీ, ప్రయాగ్‌రాజ్, వంటి ప్రాంతాలకు వెళ్లటానికి ఎంతో ఉపయోగకరంగా మారనుంది. స్పెషల్ రైలుకు ఆదరణ లభిస్తే దీనిని రెగ్యులర్ రైలుగా మార్చే అవకాశం ఉందని ఫోరం అధ్యక్షుడు ఫణి తెలిపారు.
కోతుల దాడిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గాయాలు
ఖానాపూర్: పట్టణంలోని ద్వారకానగర్‌లో కోతుల దాడిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడికి గాయాలయ్యాయి. కాలనీకి చెందిన వాల్గోట్ శ్రీనివాస్‌పై మంగళవారం కోతులు దాడి చేయడంతో వీపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాలనీలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


