సర్కారు స్కూళ్లకు శానిటరీ ప్యాడ్లు..! | - | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లకు శానిటరీ ప్యాడ్లు..!

Sep 30 2026 1:28 AM | Updated on Sep 30 2026 1:28 AM

● విద్యార్థినుల పరిశుభ్రతకు ప్రాధాన్యం ● మంచిర్యాలకు 50 ఇన్సినిరేటర్‌ యంత్రాలు ● పాఠశాల టాయిలెట్లలో బిగింపు

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థినులకు మగువ శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. సమగ్ర శిక్ష, జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఆర్‌కేఎస్‌కే) కింద ప్రభుత్వ పాఠశాలల్లోని కిశోర బాలికలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతీ విద్యార్థినికి నెలకు ఒక ప్యాక్‌ (8 న్యాప్‌కిన్లు) చొప్పున ఉచితంగా ఇవ్వనున్నారు. వీటిని మొదట మండల రిసోర్సు సెంటర్లకు చేరవేయగా అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేశారు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, చైల్డ్‌ ఫ్రెండ్లీ టీచర్లు వీటిని అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పర్యావరణ పరిశుభ్రతకు..

ఉపయోగించిన శానిటరీ ప్యాడ్‌లను సురక్షితంగా కాల్చి బూడిద చేసేందుకు టాయిలెట్స్‌ వద్ద ఇన్సినిరేటర్‌ పరికరాలు అమర్చుతున్నారు. స్వచ్ఛభారత్‌ కోష్‌ (ఎస్‌బీకే) ట్రస్టు నిధులతో హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌ ద్వారా తయారు చేయబడిన సానిటరీ న్యాప్‌కిన్‌ ఇన్సినిరేటర్‌ పరికరాలు జిల్లాకు చేరాయి. మంచిర్యాల జిల్లాకు మొత్తం 50 ఇన్సినిరేటర్లు రాగా కలెక్టరేట్‌ మహిళా టాయిలెట్లలో 10, జిల్లా సమాఖ్య కార్యాలయంలో 2, మిగిలిన వాటిని విద్యార్థినులు అధికంగా ఉన్న పాఠశాలల్లో బిగించారు. ఉపయోగించిన ప్యాడ్‌లను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఇన్సినిరేటర్‌లో వేసి కాల్చడం ద్వారా క్రీములు వ్యాపించకుండా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్యాడ్‌లు బూడిదగా మారడం వల్ల పాఠశాల మరుగుదొడ్లు, పరిసరాలు దుర్వాసన లేకుండా ఉంటాయి. నెలసరి సమయంలో మౌలిక వసతులు సరిగ్గా ఉండి ఇన్సినిరేటర్ల ద్వారా డిస్పోజల్‌ సౌకర్యంతో బాలికలు స్కూళ్లకు క్రమం తప్పకుండా హాజరవుతారు.

ఉమ్మడి జిల్లాకు 1,37,298 ప్యాక్‌లు

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కిశోర బాలికలకు 1,37,928 శానిటరీ న్యాప్‌కిన్‌ ప్యాక్‌లను కేటాయించారు. ఆదిలాబాద్‌లోని 21 మండలాలకు 39,792, మంచిర్యాలలోని 18 మండలాలకు 31,923, నిర్మల్‌లోని 19 ఎమ్మార్సీలకు 40,179, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని 15 ఎమ్మార్సీలకు 25,404 ప్యాక్‌లు కేటాయించారు. ఇప్పటికే ఆయా పాఠశాలల విద్యార్థినులకు వాటిని పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement