జన్నారం: దట్టమైన అడవులు, పచ్చదనాన్ని పంచే చెట్లు, స్వచ్ఛమైన ప్రాణవాయువు, చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులు.. ఇవన్నీ కనిపించేది కవ్వాల్ అభయారణ్యంలోనే. కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లో పలు ప్రాంతాలను పదేళ్ల క్రితం పర్యాటక స్థలాలుగా ఏర్పాటు చేశారు. జన్నారం అటవీ రేంజ్‌లోని బైసన్‌కుంట, గొండుగూడ బేస్‌క్యాంపు, వాచ్‌టవర్ వంటి ప్రదేశాల్లో పర్యాటకులను సఫారీ ద్వారా తీసుకెళ్తారు. దట్టమైన అడవిలో వన్యప్రాణులు పరుగెత్తడాన్ని నేరుగా చూసే అవకాశం లభిస్తుంది. దీని కోసం సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలలు సఫారీ నిలిపివేస్తారు. అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభిస్తారు. వర్షాకాలం, వన్యప్రాణుల పునరుత్పత్తి కారణంగా సఫారికి బ్రేక్ వేసిన అటవీ శాఖ గురువారం నుంచి సఫారీ ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎఫ్‌డీవో రామ్మోహన్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో అటవీ శాఖకు చెందిన ఐదు, పర్యాటక శాఖకు చెందిన రెండు సఫారీలను సిద్ధం చేశారు. సఫారీ పునఃప్రారంభంతో కవ్వాల్‌కు పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది.


