కాసిపేట: కాసిపేట మండలంలో 100 రోజుల్లో వందశాతం అక్షరాస్యత చేపట్టి వయోజన విద్యాశాఖ అధికారులు విజయవంతమయ్యారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ఉల్లాస్ కార్యక్రమాల్లో కొందరు వలంటీర్లు అక్షరాలు నేర్చుకున్న వారిని ఢిల్లీకి పిలవడం మండలానికి గుర్తింపు తెచ్చింది.
రాష్ట్రానికి గుర్తింపు
వందశాతం అక్షరాస్యతతో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇందుకు మంచిర్యాల జిల్లా కాసిపేట గిరిజన మండలం జాతీయ స్థాయిలో ఎంపికై మండలం నుంచి అక్షరాస్యత సాధించిన వారు, వలంటీర్లు ఢిల్లీ వేడుకలకు హాజరై సత్కారం పొందారు. అక్షరాస్యత నేర్చుకున్న జ్యోతి, బోనమ్మ, హరిలాల్, వలంటీర్లు రాజేశ్వరి, కవిత, రజిత, డీఆర్పీ బండ శాంకారిలు ఢిల్లీలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యత, ఉల్లాస్ వేడుకల్లో ప్రదర్శనలు నిర్వహించారు.
ఉల్లాస్‌లో భాగంగా..
కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వయోజన అక్షరాస్యతలో భాగంగా 2025లో తొలిసారిగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో అమలు చేశారు. కార్యక్రమంలో భాగంగా 22 పంచాయతీల పరిధిలోని గిరిజన ప్రాంతాలకు చెందిన 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి మహిళా సంఘాలకు చెందిన మహిళలను కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. మొత్తం 3,462 మంది గుర్తించి వారికి విద్యనందించేందుకు 233 మంది వలంటీర్లను నియమించారు. వీరితోపాటు 9, 10వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల ద్వారా అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించారు. వందరోజుల్లో వందశాతం లక్ష్యంగా పెట్టుకొని సాయంత్రం వేళల్లో చదవడం, రాయడం, ప్రాథమిక విద్య నైపుణ్యాలు అందించారు. వలంటీర్లకు టైలరింగ్ (కుట్టుశిక్షణ) అందిస్తూ వారి ద్వారా అక్షరాలు నేర్పడం లక్ష్యంగా ముందుకు సాగారు. ఉపాధి శిక్షణ, వయోజనులకు అక్షరాస్యత సాధించేందుకు శ్రమించి సఫలమయ్యారు. ఇందులో అన్ని శాఖల అధికారులను భాగస్వాములు చేయడంతోపాటు స్పాన్సర్లను చూసి కుట్టుమిషన్ల పంపిణీ, అక్షరాస్యతకు సంబంధించి మెటీరియల్ పరీక్షల నిర్వహణ చేపట్టారు. దీనికి కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ వయోజన విద్యా డైరెక్టర్, మండల అధికారులు పూర్తిస్థాయిలో చేదోడువాదోడుగా ఉండటంతో అనుకున్న లక్ష్యం నెరవేరింది.


