ఆదిలాబాద్‌రూరల్: ఈజీ మనీ కోసం అత్యాశతో నకిలీ కరెన్సీ ముఠా మాయలో పడి పోగొట్టుకున్న డబ్బును రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేసిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. ఈ రెండు కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని పాండర్‌కవడకు చెందిన ప్రతీక్‌తో , దీపక్‌పవార్, అలోక్, సురేందర్‌కు పరిచయం ఏర్పడింది. నాగ్‌పూర్‌కు చెందిన నకిలీ కరెన్సీ గ్యాంగ్‌తో పరిచయమైంది. రూ.లక్ష ఇస్తే రూ.4 లక్షల నకిలీ కరెన్సీ ఇస్తామని సదరు గ్యాంగ్ నమ్మించారు.రూ. 5 లక్షలు చెల్లించి రూ. 20 లక్షల నకిలీ కరెన్సీ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.
పోలీసుల పేరిట డ్రామా..
సురేందర్ మహారాష్ట్రకు చెందిన షేక్ షకీబ్ నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నారు. ఈనెల 10న మావల సమీపంలోని జాతీయరహదారి వద్ద గ్యాంగ్ సభ్యులకు అందజేశారు. గ్యాంగ్ సభ్యులు నకిలీ కరెన్సీ ఉన్నట్లు చూపిస్తూ బాక్స్ తెచ్చారు. అయితే ముందస్తు ప్లాన్ ప్రకారం మరికొందరు అక్కడ ప్రత్యక్షమయ్యారు. తాము పోలీసులమని బెదిరింపులకు పాల్పడి రూ.5 లక్షల నగదుతో నాగ్‌పూర్ వైపు పరారయ్యారు. షేక్ షకీబ్ మరో ఇద్దరు మహ్మద్ సితార్, ప్రథమ్‌తో కలిసి తమ డబ్బును తిరిగి రాబట్టేందుకు సురేందర్, అలోక్, దీపక్‌లను తమ అదుపులోకి తీసుకున్నారు. బందీగా ఉన్న సురేందర్‌తో అతని భార్యకు ఫోన్ చేయించి, రూ. 5 లక్షలు చెల్లిస్తేనే విడుదల చేస్తామని బెదిరించారు. కిడ్నాపర్ల ఫోన్‌తో భార్య మావల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మరోవైపు నకిలీ కరెన్సీ వ్యవహారంపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈనెల 13న దస్నాపూర్ పెట్రోల్‌బంక్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న కారును గుర్తించి అదుపులో తీసుకుని విచారించారు. రెండు కేసుల పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నాప్ కేసులో చంద్రపూర్ జిల్లా గాఢ్‌చందుర్‌కు చెందిన షేక్ షకీబ్, మహ్మద్ సితార్, ప్రథమ్ రవీంద్ర గురుకుందల్‌వార్ ఉన్నారు.


