ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
30గ్రామాలకు నిలిచిన రాకపోకలు
జిల్లాలో 80.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
ఇంకా పదిశాతం లోటు
ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
మరో రెండ్రోజులు భారీ వర్షాలు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
జిల్లాలో వర్షపాతం వివరాలు
(మి.మీటర్లలో)
మండలం వర్షపాతం
కాసిపేట 123.5
హాజీపూర్ 107.4
చెన్నూర్ 105
మందమర్రి 104.4
మంచిర్యాల 103.1
బెల్లంపల్లి 96.5
నస్పూర్ 94.2
లక్సెట్టిపేట 93.7
జన్నారం 92.8
జైపూర్ 91.8
భీమారం 85.5
వేమనపల్లి 76.4
కోటపల్లి 72.2
దండేపల్లి 53.1
తాండూర్ 51
నెన్నెల 36.4
భీమిని 32.7
కన్నెపల్లి 31.3
ఎల్లంపల్లి జలాశయం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ధాటికి దిగువ ప్రాంతాల్లోని రోడ్లు, తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కాజ్‌వే, కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో వివిధ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు జిల్లాలో 80.6మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాసిపేట, హాజీపూర్, మందమర్రి, మంచిర్యాల, చెన్నూర్ మండలాల్లో వంద మిల్లీమీటర్లకు పైబడి వర్షం కురిసింది. బుధవారం రోజంతా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతం వేమనపల్లి, కోటపల్లి అర్జునగుట్ట వద్ద ప్రాణహిత వరద ప్రవాహం పెరిగింది. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. నెన్నెల, వేమనపల్లి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం, వరద తీవ్రతతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పత్తి చేరులోకి నీరు చేరడంతో పత్తి మొలకలు నీట మునిగాయి. కోటపల్లి మండలం ఆలుగా మ గ్రామంలో ఇంటి పైకప్పు కూలి నలుగురు గాయపడ్డారు. శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి ప్రాంతాల్లోని ఓపెన్ కాస్టుల్లోకి వరదనీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లింది.
అన్నదాతల్లో హర్షం
గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా భారీ వర్షాలు లేక పంటల సాగు సమయం ఎత్తిపోతుండడంతో ఆందోళనకు గురయ్యారు. వరి పొలాలు బీడుగా వదిలేశారు. ఆలస్యమైనా వర్షం పడుతుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇదే అత్యధిక వర్షం కావడం గమనార్హం. జలాశయాల్లోకి నీరు చేరుతుండడంతో వరినాట్లకు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు జిల్లా సగటు 26శాతం లోటు నెలకొనగా ప్రస్తుతం 10శాతం లోటుతో సాధారణ స్థాయికి చేరింది. తాండూర్, బెల్లంపల్లిలో 22 నుంచి 36శాతం అధికంగా, ఐదు మండలాల్లో 20 నుంచి 56శాతం లోటు, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
మత్తడి దూకుతున్న ర్యాలీవాగు
‘ఎల్లంపల్లి’కి భారీగా వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మొన్నటి వరకు 8టీఎంసీల నీటిమట్టంతో ఉండగా.. గత మూడు రోజుల్లో ఏకంగా రోజుకో టీఎంసీ చొప్పున మూడు టీఎంసీల నీటిమట్టం పెరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.500టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 76 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ సుజల స్రవంతి పథకానికి 275 క్యూసెక్కులు, నంది పంప్‌హౌస్‌కు 12,600 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
జిల్లాలోని నీల్వాయి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 0.836 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.732 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 1630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గొల్ల వాగు 155.50 మీటర్లు కాగా ప్రస్తుతం 140.6 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 1125 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ర్యాలీవాగు పూర్తి స్థాయి నీటిమట్టం 151.5 మీటర్లు కాగా ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో 151.7 మీటర్లు చేరి మత్తడి దూకుతోంది. ఇన్‌ఫ్లో 900 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
కుంగిన ఏసీసీ క్వారీ బ్రిడ్జి
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని ఎంసీసీ(ఏసీసీ) నుంచి గఢ్‌పూర్‌కు వెళ్లే దారిలో ఉషోదయ స్కూల్ దాటిన తరువాత రాళ్లవాగుపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోతోంది. భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో బ్రిడ్జి కోతకు గురవుతూ ఒకవైపు కూలుతోంది. దీంతో అప్రమత్తమైన మంచిర్యాల సీఐ ప్రమోద్ బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఆండాళమ్మ కాలనీ నుంచి రంగంపేట్ మీదుగా మంచిర్యాలకు రావడం, మంచిర్యాల నుంచి అదే రోడ్డులో గఢ్‌పూర్‌కు వెళ్లాలని ప్రజలకు సూచించారు. పాతకాలం నాటి బ్రిడ్జి కావడంతో వరద ఉధృతి పెరిగితే కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మంచిర్యాలక్రైం: మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలను స్థానిక డీసీపీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాళ్లవాగు కాజ్‌వేపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాళ్లవాగు నుంచి పాత మంచిర్యాల, రాళ్లపేటకు రాకపోకలు నిలిపివేశారు. నీల్వాయి, కోటపల్లి ప్రాంతాల వైపు ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, కమిషనరేట్ పరిధిలో 30 మంది ప్రత్యేక శిక్షణ పొందిన వారు ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే 100 డయల్‌కు సమాచారం అందించాలని అన్నారు. పోలీస్ సిబ్బంది 24గంటలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు, ఎస్సైలు, తహసీల్దార్ రైమతుల్ల హుస్సేన్ పాల్గొన్నారు.


