కమిషనర్‌ వర్సెస్‌ చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ వర్సెస్‌ చైర్‌పర్సన్‌

Jul 30 2026 12:39 AM | Updated on Jul 30 2026 12:39 AM

● ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం ● పోలీసుస్టేషన్‌లో ఇరువురి ఫిర్యాదు

రామకృష్ణాపూర్‌: మున్సిపల్‌ ఎన్నికల సమయంలోనే వివాదాలకు కేంద్ర బిందువైన క్యాతనపల్లి మున్సిపాల్టీలో మరోసారి రాజకీయ, పాలనపరమైన వివాదం తెరపైకి వచ్చింది. కమిషనర్‌, చైర్‌పర్సన్‌ వర్గం మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగి పోలీసుస్టేషన్‌ వరకు వెళ్లింది. కమిషనర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కౌన్సిలర్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడం, నాలాలు పొంగిపొర్లడంతో కమిషనర్‌ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం ఆయా వార్డుల్లో పర్యటించి పరిశీలించారు. ఈ పర్యటనపై చైర్‌పర్సన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ చైర్‌పర్సన్‌ గొడిసెల సంధ్యారాణి భర్త, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ రాజరమేష్‌ కమిషనర్‌ను ఫోన్‌లో ప్రశ్నించారు. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. అనంతరం మొదటి వార్డులో ఓ ఇంటిని కమిషనర్‌ పరిశీలిస్తుండగా.. రాజరమేష్‌, రామిడికుమార్‌, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అక్కడికి వెళ్లారు. తమ వార్డుల్లో పర్యటిస్తున్న సందర్భంలో సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చైర్‌పర్సన్‌ దళితురాలు కావడం వల్లే చిన్నచూపు చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో కమిషనర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటమాట పెరిగి పరస్పర దూషణల వరకు వెళ్లింది.

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

తనను రాజరమేష్‌, నాయకులు రామిడికుమార్‌, మరికొందరు అనుచిత పదజాలంతో దుర్భాషాలాడారని, విధులకు ఆటంకం కలిగించారని కమిషనర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చైర్‌పర్సన్‌ దళితురాలు కావడం వల్లే సమాచారం ఇవ్వకుండా కమిషనర్‌ చిన్నచూపు చూస్తున్నారని, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను పట్టించుకోకుండా అనుచితంగా మాట్లాడారని బీఆర్‌ఎస్‌ నాయకులూ ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్‌ నాయకుల కౌంటర్‌..

కమిషనర్‌ ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటే చైర్‌పర్సన్‌ భర్త, బీఆర్‌ఎస్‌ నాయకులు అనుచితంగా ప్రవర్తించడమేమిటని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్‌, పల్లె రాజు, యాకూబ్‌అలీ, గోపురాజం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. కాగా, కమిషనర్‌ ఫిర్యాదు మేరకు విధులకు ఆటంకం కలిగించిన బీఆర్‌ఎస్‌ నాయకులు రాజరమేష్‌, రామిడికుమార్‌పై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ పర్స రమేష్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదుపై విచారణ చేపడుతామని తెలిపారు.

మున్సిపల్‌ కార్యాలయం

ఎదుట ఆందోళన

కమిషనర్‌ వైఖరిని నిరసిస్తూ చైర్‌పర్సన్‌తోపాటు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. చైర్‌పర్సన్‌ సంధ్యారాణి మాట్లాడుతూ కమిషనర్‌ చెన్నూర్‌లో అక్రమాలకు పాల్పడడంతో ఇల్లందుకు బదిలీ చేస్తే పైరవీలు చేసుకుని మళ్లీ క్యాతనపల్లికి వచ్చారని అన్నారు. చెన్నూర్‌లో ఆయనను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ క్యాతనపల్లికి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ప్రతీ విషయంలో పాలకవర్గాన్ని, సిబ్బందిని కమిషనర్‌ చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. కమిషనర్‌ వైఖరిపై త్వరలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement