మంచిర్యాలటౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. డయేరియా, జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య 500 వరకు ఉండగా, ఈ నెల 20 నుంచి భారీగా పెరుగుతోంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో ఒకరికి వైరల్ జ్వరం వస్తే ఒకరి నుంచి మరొకరికి వస్తుండడంతో ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని గ్రామాలు, పట్టణా ల్లో డ్రెయినేజీలు నిండిపోవడం, రోడ్ల పక్కన చెత్త వేసి రోజుల తరబడి ఉంచడం, వర్షపు నీరు లోత ట్టు ప్రాంతాల్లో నిలిచి ఉండడం వల్ల వ్యాధులకు కారణం అవుతున్నాయి. వర్షాలతో నీరు కలుషితం కావడం కూడా ఒక కారణంగా వైద్యులు చెబుతున్నారు. కొత్తనీరు విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు తాగాలని, వేడిగా వండిన ఆహారం మాత్రమే తీసుకోవాలని, ఈగలు వాలకుండా చూడడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అపరిశుభ్ర వాతావరణం వల్లనే జ్వరాలు వస్తుండగా, కలుషిత నీరు, ఆహారంతో డయేరియా బారిన పడుతున్నారు.
తేదీ రోగులు
20 1,180
21 778
22 1,027
23 1,060
24 956
25 747
27 1,302
28 951
29 730


