● కలెక్టర్ కుమార్ దీపక్ ఆగ్రహం
కోటపల్లి: ‘ఇదేం ఆసుపత్రి.. ఇలాగేనా ఉండేది. ఇలా ఉంటే రోగులు ఎవరు వస్తారు. ఆస్పత్రిలో ప్రసవాలు ఎందుకు కావడం లేదు. సిబ్బంది ఏం చేస్తున్నారు..’ అంటూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోటపల్లి ఆసుపత్రి నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో నీరు నిల్వ ఉండడంతోపాటు సరైన సౌకర్యాలు కనిపించపోవడంతో సిబ్బందిని ప్రశించారు. బోర్డులో ప్రసవాల సంఖ్య, గర్భిణుల వివరాలు నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు. సరైన సమాచారం లేకుండా ఎలా పని చేస్తున్నారని నిలదీశారు. స్లాబ్ నుంచి నీరు లీక్ కావడంపై కాంట్రాక్టర్ ఎవరని ఆరా తీశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కేజీబీవీని సందర్శించి సౌకర్యాలు పరిశీలించారు. మండలంలోని అర్జునగుట్ట సమీపంలో ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం, సమీప పరిస్థితులు తెలుసుకున్నారు. వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. నదిలో నీటి ప్రవాహ తీవ్రతను పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ కృష్ణ, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత పాల్గొన్నారు.


