తాండూర్/కాసిపేట: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం తాండూర్ మండలం కొత్తపల్లి, మండల కేంద్రమైన కాసిపేటలోని రైతువేదికల్లో విత్తన మేళాలను ఆయన సందర్శించారు. రాయితీ విత్తనాలు, ఎరువులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగం ఉన్న పంటలు సాగు చేయాలని, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే అధిక లబ్ధి పొందడమే కాక భూసారం కూడా పెంపొందుతుందని తెలిపారు. కాసిపేట కేజీబీవీ లో అదనపు తరగతి గదుల నిర్మాణం, భోజనశాల పనులు పూర్తి చేయాలని సూచించారు. తాండూర్ మండలం ద్వారకాపూర్ గ్రామంలో సమగ్ర భూసర్వే అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సబ్ కలెక్టర్ మనోజ్, తాండూర్ తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీఓ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి సుష్మ, కాసిపేట ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఏఈఓ సాగర్ పాల్గొన్నారు.


