భైంసారూరల్: మండలంలోని కోతల్‌గాంలో పూజల పేరిట ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడినట్లు భైంసారూరల్ సీఐ ప్రవీణ్ తెలిపారు. గ్రామానికి చెందిన చందుల్‌వార్ దత్తాత్రి సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం పంటచేలకు వెళ్లాడు. భిక్షాటనకు వచ్చిన భైంసాకు చెందిన ముద్దేవార్ శాంతాబాయి, సాయవ్వ ఇద్దరూ కలిసి దత్తాత్రి ఇంటికి వచ్చారు. మీ ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగా ఉండడంలేదని, పూజలు చేస్తే సమస్య తొలగిపోతుందని అతని భార్య కవితను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించారు. దేవుడి గదిలో దీపం వెలిగించి పూజలు చేస్తుండగా ఇంటికి వచ్చిన దత్తాత్రి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని వారిని మందలించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వా త దేవుడి గదిని పరిశీలించగా అక్కడ ఉన్న రూ.15 వేల విలువైన ఐదు తులాల రెండు వెండి కడియాలు కనిపించలేదు. బాధితుడు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో ఎస్సై సుప్రియ పాల్గొన్నారు.


